కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు  | Sakshi
Sakshi News home page

కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు 

Published Tue, Feb 4 2020 2:18 AM

Two New Revenue Divisions In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మెదక్‌ జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడను నూతన రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటితో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచి్చన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని డివిజన్లు, మండలాలకు లైన్‌క్లియర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

కొత్తగా చౌట్కూరు మండలం 
ప్రతిపాదిత జోగిపేట రెవెన్యూ డివిజన్‌లో నాలుగు మండలాలను ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం సంగారెడ్డి డివిజన్‌లో కొనసాగుతున్న అందోల్, పుల్కల్, వట్పల్లి మండలాలతోపాటు కొత్తగా చౌట్కూరు మండలాన్ని ఏర్పాటు చేసింది. పుల్కల్‌ మండలం నుంచి కొన్ని గ్రామాలను తొలగించి చౌట్కూరు మండలంలో కలిపింది. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 586కు చేరింది.

వేములవాడ డివిజన్‌ ఇలా.. 
ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌లో ఉన్న 6 మండలాలతో వేములవాడ డివిజన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో వేములవాడ, వేములవాడ (గ్రామీణ), చందూర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రండి మండలాలున్నాయి. ఇదిలావుండగా డివిజన్లు, మండలం ఏర్పాటుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.   

Advertisement
Advertisement