‘అనారోగ్య’ కేంద్రాలు | Sakshi
Sakshi News home page

‘అనారోగ్య’ కేంద్రాలు

Published Thu, Jul 24 2014 12:31 AM

‘అనారోగ్య’ కేంద్రాలు - Sakshi

 సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 7 లక్షలు వెచ్చించి మందులు  కొనుగోలు చేస్తున్నా సరిపోవడం లేదు. చివరికి రోగులకు గ్లూకోజ్ బాటిళ్లు కూడా పెట్టడం లేదు. ఆస్పత్రికి ప్రతి రోజూ ఔట్‌పేషెంట్లుగా 350 నుంచి 400 మంది వస్తున్నారు. 250 పడకలున్న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సుమారు 350 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. యాంటిబయాటిక్, యాంటీ రేబిస్, ఏఆర్‌వీ, ఇన్సులిన్, గ్లూకోజ్ బాటిళ్ల కొరత ఉంది. సెప్టెంబర్ నాటికి ఇవ్వాల్సిన కోటా మందులు కూడా ముందే వాడుకున్నారు. ఆస్పత్రి స్థాయికి తగినట్లుగానే డాక్టర్లున్నా సమయపాలన  పాటించక రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
 
 నల్లగొండ మండలం రాములబండలోని పీహెచ్‌సీలో కేవలం జ్వరాలకు మాత్రమే మందులు అందజేస్తున్నారు. తిప్పర్తి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లకు గాను ఒక్కరూ లేరు. దీంతో ఇక్కడ రోగులకు ఏఎన్‌ఎంలే దిక్కవుతున్నారు.    ఆలేరులోని 30 పడకల ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు అంతంతమాత్రమే. డిప్యూటీ సివల్ సర్జన్ పోస్టు  ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది. ఆస్పత్రికి 24 గంటలు కరెం టు సరఫరా చేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. జనరేటర్  పని చేయటం లేదు. స్కానింగ్ మిషన్ పని చేయ టం లేదు.  మార్చురీ గదిలో శవాలను భద్రపరిచేందుకు ఉపయోగించే రెండు ఏసీలు చెడిపోయాయి. శారాజీపేట పీహెచ్‌సీలో ఎక్స్‌రే, స్కానింగ్ మిషన్‌లు లే వు.  గుండాల పీహెచ్‌సీలో సిబ్బంది సమయపాలన పాటించరు.   
 
 సిబ్బంది స్థానికంగా నివాసం ఉండక హైదరాబాద్, నల్లగొండ నుంచి రావడం వల్ల సమయానికి చేరుకోవడం లేదు.  బొమ్మలరామారంలో  రోగులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. వైద్యాధికారి,  సిబ్బంది మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. యాదగిరిగుట్ట పీహెచ్‌సీలో  పాముకాటు మందు అందుబాటులో లేదు. వరండాలో తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. రాజాపేట లో 24 గంటల వైద్య సదుపాయం ఉన్నా సిబ్బంది కొరత ఉంది. తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం పేరుకే 24 గంటల ఆసుపత్రి. సేవలు మాత్రం నిల్. భువనగిరి నియోజకవర్గంలోని ఏరియా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు , మెడికల్ సిబ్బంది కొరత ఉంది. చేయి తడపనిదే కింది స్థాయి సిబ్బంది పనులు చేయడంలేదు.
 
 చిన్నరోగానికి కూడా సికింద్రాబాద్‌కు రెఫర్ చేయడం ఆనవాయితీగా మారింది. మందుల కోసం డాక్టర్లు బయటకు చీటీలు రాస్తున్నారు. పోచంపల్లి పీహెచ్‌సీలో రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ లేడు. బీబీనగర్ మండలం కొండమడుగు పీహెచ్‌సీలో పని చేస్తున్న స్టాఫ్ నర్సు రోగులకు వైద్యం చేయడం లేదు.  బీబీనగర్ పీహెచ్‌సీలోని ఒక పారా మెడికల్, హెల్త్ సూపర్‌వైజర్, ఒక హెల్త్ అసిస్టెంట్, ఏఎన్‌ఎమ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వలిగొండ వైద్యశాలలో ఒక డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకుంది. పై కప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఓపీ రూం, ఆపరేషన్ థియేటర్ రూంతో సహా  అన్ని గదులలో పెచ్చులూడుతున్నాయి. మరమ్మతుల్లేక జనరేటర్ మూలకు పడింది. మండలంలోని వర్కట్‌పల్లి, వేములకొండలలో వైద్యం సరిగా అందడంలేదు.
 
 చౌటుప్పల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమయపాలన లేదు. డిప్యూటీ సివిల్‌సర్జన్ పోస్టు ఖాళీగా ఉంది. మునుగోడు పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లకు గాను ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. చండూరులోని ఇద్దరు డాక్టర్లలో రోజుకొకరు వంతులవారీగా విధులకు హాజరవుతున్నారు. సమయపాలన ఎవరూ పాటించడం లేదు. మర్రిగూడలో రెండు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంస్థాన్ నారాయణపురంలో ల్యాబ్ టెక్నీషియన్ లేడు. పలుచోట్ల ఆస్పత్రులలో మందులు లేక బయటికి రాస్తున్నారు.     దేవరకొండ కమ్యూనిటీ వైద్యశాలలో ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఒక సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఏపల్లి పీహెచ్‌సీకి సిబ్బంది కొతర వేధిస్తోంది.
 
 చింతపల్లి మండలం మాల్‌లో ఉన్న పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులకు గాను ఒక్కరే ఉన్నారు. డిండి పీహెచ్‌సీ 24 గంటల వైద్య కేంద్రమైనా సరిపోను సంఖ్యలో సిబ్బంది లేరు. జనరేటర్ పని చేయకపోవడంతో రాత్రి సమయాల్లో వైద్య సేవలకు ఇబ్బందిగా ఉంది. కొండమల్లేపల్లి పీహెచ్‌సీ పట్టణ కేంద్రానికి కాస్త దూరంగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడలోని 30 పడకల వైద్యశాలలో ఆపరేషన్ సమయంలో పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అంబులెన్స్ మూలనపడింది. ఇదే ఆవరణలో ఉన్న హోమియో వైద్యశాల తలుపులు తీసేవారే కరువయ్యారు. వైద్యశాల ఆవరణ కొంత ఆక్రమణకు గురయ్యింది. ఇక్కడ  అత్యవసర మందులైన పాముకాటు, కుక్కకాటు మందులు అందుబాటులో లేవు.
 
 మండలంలోని కాపుగల్లులో  గైనకాలజిస్టు లేకపోవడంతో మహిళా రోగులు  ఇబ్బందులు పడుతున్నారు.  కాపుగల్లు, అనంతగిరిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. చిలుకూరు ఆరోగ్య కేంద్రంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉన్నా ఆపరేషన్లు మాత్రం జరగడం లేదు. నడిగూడెం మండల పరిధిలోని త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ల్యాబ్‌టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ముగ్గురు హెల్త్ అసిస్టెంట్‌లు, సీనియర్ అసిస్టెంట్,  స్వీపరు, అటెండరు పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ము నగాల మండలం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు వారంలో రెండురోజులు మాత్రమే వస్తున్నారు.
 
 మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించడంలేదు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ సుమారు 400మంది ఔట్‌పేషెంట్లు వచ్చివెళుతుంటారు. డాక్టర్లు సమయానికి రాక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో గైనికి సివిల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉండటంతో గర్భిణులు వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అంబులెన్స్ మూలకు పడిపోయింది. ఆస్పత్రిలో ఉన్న 300 ఎంఏ ఎక్స్‌రే మిషన్ చెడిపోయి 3 నెలలైనా మరమ్మతులు చేయించే పరిస్థితిలేదు. ఈసీజీ మిషన్లు కూడా చెడిపోయాయి. ఆలగడప , పాములపాడు, అడవిదేవులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వేములపల్లి, దామరచర్ల పీహెచ్‌సీల్లో 24 గంటలు సేవలు అండం లేదు. అన్ని పీహెచ్‌సీలలో ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్లు పనిచేయక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
 
 తుంగతుర్తి నియోజకవర్గంలో 30పడకల ఆస్పత్రి, 7పీ హెచ్‌సీలు ఉన్నాయి. చాలా చోట్ల వైద్య సి బ్బంది కొరత తో వైద్య సేవలు సరిగా అందడం లేదు. వై ద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో ప్రతి రోజూ ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నారు. తుంగతుర్తి ఆస్పత్రిలో రెండేళ్ల నుంచి ఎక్స్‌రే మిషన్  పనిచేయడం లేదు. నీటి సమస్య ఉంది. పీహెచ్‌సీలలో వైద్య సేవలు సరిగ్గా అందక ప్రసవాలు నామమాత్రంగా జరుగుతున్నాయి.    హుజూర్‌నగర్‌లోని 100 పడకల వైద్యశాలలో ఐసీయూ, ఎన్‌ఐసీయూ, 320 ఎంఏ ఎక్స్‌రే ప్లాంట్, స్కానింగ్ మిషన్, అత్యాధునిక ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, రక్తనిధి కేంద్రాలు లేవు. ప్రస్తుతం వైద్యశాలలో నలుగురు వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు.
 
 ఇంకా సివిల్ సర్జన్లు 4, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌లు 5, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్‌ల నియామకం జరగాల్సి ఉంది. ఈ వైద్యశాలకు ప్రతిరోజూ అత్యవసర కేసులు కాకుండానే సుమారు 300 నుంచి 350 మంది రోగులు వస్తున్నారు. రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు లభించడం లేదు. నేరేడుచర్ల పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులకుగాను ఒక వైద్యాధికారి విధులకు హాజరు కాకుండా మిర్యాలగూడలోని ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కే సమయాన్ని కేటాయిస్తున్నారు. గరిడేపల్లి ఆరోగ్యకేంద్రం ఊరికి దూరంగా ఉండటంతో ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మఠంపల్లి పీహెచ్‌సీలో ఇన్‌చార్జ్ వైద్యాధికారి విధు లు నిర్వహిస్తున్నారు. వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే రోగులకు అందుబాటులో ఉండటం వల్ల మి గిలిన సమయాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
 
 సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేరు. మూడు సివిల్ సర్జన్ పోస్టులు ఉండగా.. ఒక్కరూ లేరు.  గైనకాలజిస్టు పోస్టు మంజూరు చేయకపోవడం గర్భిణులకు ఇబ్బందిగా మారింది. ఆత్మకూర్.ఎస్ పీహెచ్‌సీలో డాక్టర్ వేరొక చోట ఇన్‌చార్జ్‌గా ఉండటంతో అందుబాటులో ఉండలేకపోతున్నారు. స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, పీహెచ్‌ఓ, హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివ్వెంల పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.     నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ చిన్న కేసు వచ్చినా నల్లగొండకు రెఫర్ చేస్తున్నారు. అవసరమైన మేర మందుల సరఫరా లేక  ప్రైవేట్ మెడికల్ దుకాణాల్లో తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ  డబ్బులిస్తేనే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. డాక్టర్‌లు రోగులకు అందుబాటులో ఉండటం లేదు.
 
 త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి పీహెచ్‌సీలో ఇద్దరు  డాక్టర్లు ఉన్నా విధులకు సక్రమంగా రాకపోవడంతో అక్కడ పని చేసే పార్మసిస్టే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిడమనూరు పీహెచ్‌సీలో తాగునీటి సౌకర్యం లేదు. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని ప్రభుత్వ వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మందులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది సమయ పాలన పాటించక రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు.
 
 నకిరేకల్ పట్టణంలో ఉన్న 30 పడకల వైద్యశాలలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో రెండేళ్లుగా జనరేటర్ పనిచేయడంలేదు. కేతేపల్లి పీహెచ్‌సీలో సమయ పాలన పాటించక పోవటంతో రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. చిట్యాల మండలంలో చిట్యాల, వెలిమినేడు ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. నార్కట్‌పల్లి ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓ డిప్యుటేషన్‌తో నల్లగొండలో విధులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ విధులకు హాజరుకావటం లేదు. నీటి సమస్య ఉంది. రెండేళ్లుగా ఆపరేషన్లు చేయటం లేదు.
 

Advertisement
Advertisement