ఇబ్రహీంపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ బృందం | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ బృందం

Published Sun, Nov 29 2015 1:15 AM

ఇబ్రహీంపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ బృందం - Sakshi

గ్రామంలో ఇటలీ, కెనడా ప్రతినిధులు
సమగ్ర వివరాల సేకరణ
పారిశుద్ధ్య గ్రామంపై కితాబు
 సిద్దిపేట జోన్ :
యూనిసెఫ్ ప్రతినిధులు శనివారం సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో ఇంటింటికి తిరిగి అధ్యయనం చేశారు. దోమ రహిత గ్రామంగా, ఇంకుడు గుంతల నిర్మాణంతో రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొందిన ఇబ్రహీంపూర్‌ను ఇటలీకి చెందిన జూకోమో, కెనడాకు చెందిన గ్యాబీలు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంకుడు గుంతలను పరిశీలించారు. వీటి నిర్మాణానికి చేసిన వ్యయంపై ఆరాతీశారు. అదే విధంగా గ్రామంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను గూర్చి వివరాలు సేకరించారు. వాటి వినియోగం స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి పట్టిన వ్యయంపై గ్రామ ప్రజల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు, తీసుకున్న ప్రక్రియలను బృందం అడిగి తెలుసుకుంది.

చేతులు శుభ్రం చేసుకునే విధానంపై గ్రామస్తుల ద్వారా ఆరా తీశారు. గ్రామంలోని మహిళలతో మాట్లాడారు. మంచి వాతావరణంతో కూడిన గ్రామంగా ఏర్పడడడాన్ని వారు అభినందించారు. ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రజలు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలు, వాటి సత్ఫలితాలు గురించి అడిగారు. వ్యవసాయ స్థితిగతులను రైతుల ద్వారా తెలుసుకున్నారు. అంతకు ముందు గ్రామంలో వినూత్నంగా చేపట్టిన పలు ప్రక్రియలను వీడియో ద్వారా డాక్యుమెంటరీ చిత్రీకరించారు.  వారి వెంట హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్లు సుధాకర్‌రెడ్డి, అవినాష్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, సర్పంచ్ లక్ష్మి, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, నగేష్‌రెడ్డి తదితరులున్నారు.
 

Advertisement
Advertisement