నరకం | Sakshi
Sakshi News home page

నరకం

Published Sat, May 10 2014 2:11 AM

నరకం

  •    ‘జడి’సిన నగరం
  •    అకాల వానతో కకావికలం
  •    గోదారులైన రహదారులు
  •    స్తంభించిన రాకపోకలు
  •    రోడ్లపై నిలిచిన నీళ్లు
  •    పూడికతీయని నాలాలు
  •    లోతట్టు ప్రాంతాలు మునక
  •  సాక్షి, సిటీబ్యూరో: షరా మామూలు. శుక్రవారం కురిసిన వానతో నగరం కకావికలమైంది. సరిగ్గా కార్యాలయాలకు వెళ్లే.. తిరిగి వచ్చే వేళ కురిసిన వానతో రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల నాలాలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. మెహిదీపట్నం, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. నాలాలు, మురుగునీటి పైప్‌లైన్లలో పేరుకుపోయిన పూడికతో వర్షపు నీరు వెళ్లే దారి లేకుండాపోయింది. దీంతో నీరంతా సమీపంలోని రహదారులు, కాలనీలను ముంచెత్తింది. ఇంత జరిగినా జీహెచ్‌ఎంసీ, జలమండలిలోని అత్యవసర బృందాలు జాడలేకుండా పోయాయి.
     
    ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

    శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం ప్రభావం ట్రాఫిక్‌పై పడింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్, మలేషియా టౌన్‌షిప్, పంజగుట్ట, అమీర్‌పేట తదితర ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. ఉదయం వేళ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పనులపై బయల్దేరిన జనం అవస్థలు పడ్డారు. తిరిగి సాయంత్రం పడిన వానతో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. అబిడ్స్, కోఠి, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, తార్నాక, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బాలానగర్, సనత్‌నగర్, మెహిదీపట్నం, చార్మినార్, బహదూర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నరకం చూపించింది.
     
    పూర్తికాని పనులు.. రోడ్లపైకి నీళ్లు

    వర్షం పడిన ప్రతిసారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం నగరంలో షరా మామూలైంది. వాననీరు వెళ్లే దారిలేక రోడ్లపైనే నిలిచిపోతుండటం ఇందుకు కారణం. ఏటా ఎదురవుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, రోడ్లపై నీరు నిలవకుండా, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో వరదనీటి సంపులు నిర్మించాలని, అవసరమైన పైప్ డ్రెయిన్‌లు వేయాలని, మరమ్మతులు చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని అధికారులు భావించారు.

    తద్వారా ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంచనా వేశారు. తరచూ నీరు నిలిచిపోతుండటం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చని లెక్కలు వేశారు. ఈ క్రమంలో 104 నీటిముంపు ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులన్నింటినీ వేసవిలోపు, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలనుకున్నారు. 13 ప్రదేశాలకు మాత్రం ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఏప్రిల్‌లోనే మరమ్మతులు చేయాలనుకున్నారు. ప్రణాళిక బాగానే ఉన్నా.. కార్యాచరణ కొరవడింది. దీంతో గురు, శుక్రవారాల్లో కురిసిన వానతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

    ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పనులు చేయలేకుంటే, మిగతా ప్రాంతాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన పనుల అంచనా వ్యయం రూ. 61. 33 లక్షలు. నిధులున్నా పనులు పూర్తికాలేదు. ఫలితంగా నాలుగు చినుకులకే నగరవాసి నరకం చవిచూశాడు. ఇక, వర్షాకాలంలో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  కాగా, బషీర్‌బాగ్, అంబర్‌పేట, అమీర్‌పేట ధరంకరం రోడ్డు ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులందాయి. లక్‌డికాపూల్‌లో పోలీస్‌స్టేషన్ సమీపంలో నీటినిల్వకు సంబంధించి ఫిర్యాదు అందింది.
     
    ఇదా మీ పనితీరు?

    నగరంలో నీటి నిల్వ ప్రాంతాలు, డీసిల్టింగ్ పనుల తనిఖీకి శుక్రవారం ఆయా ప్రాంతాలకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్.. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద నీటి నిల్వ సమస్య గురించి గవర్నర్ నరసింహన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అధికారులపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు.

    లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ దగ్గర పనులకు మార్గదర్శకాలతోపాటు అవసరమైన నిధులు మంజూరుచేసినా పనులెందుకు పూర్తి చేయలేదంటూ ఈఈపై విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రిలోగా పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్య లు తప్పవని సోమేష్‌కుమార్ హెచ్చరించారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయనందునే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని కమిషనర్ అన్నారు.

    గతంలో తీవ్ర సమస్యగా ఉన్న మైత్రీవనం వద్ద అవసరమైన చర్యలు తీసుకున్నందున అక్కడ నీటినిల్వ సమస్య సమసిపోయిందని, 15 నిమిషాల్లో వరద నీరు మొత్తం వెళ్లిపోతోందన్నారు. తగినన్ని నిధులున్నా, ప్రజలు కష్టాలు పడుతున్నా చలించని ఇంజినీర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్.. ఈఎన్‌సీ ధన్‌సింగ్, చీఫ్ ఇంజినీర్ ఆంజనేయులు తదితరులతో కలిసి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం, బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్, టోలిచౌకి, షేక్‌పేట, మైత్రీవనం ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
     

Advertisement
Advertisement