యూరియా.. మాయా! | Sakshi
Sakshi News home page

యూరియా.. మాయా!

Published Tue, Jul 1 2014 11:51 PM

యూరియా..  మాయా!

గజ్వేల్: ‘మెతుకుసీమ’లో ఈసారి కూడా యూరియా కొరత తప్పదా? గంటల తరబడి నిరీక్షణ.. ఒక్క బస్తా కూడా అందక రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయా? అని ప్రశ్నిస్తే అవుననే అనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తుంటే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది.
 
 యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో భాగంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి.. ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. ఎమ్మార్పీకి విక్రయిస్తే.. రవాణా చార్జీలు తామే భరించాల్సి వస్తోందని, నష్టానికి వ్యాపారం ఎలా చేస్తామనే వాదనను తెరపైకి తెచ్చిన వ్యాపారులు.. నిల్వలను సమృద్ధిగా మార్కెట్‌లోకి తేవడంలో విముఖత చూపుతుండటంతో ఈ రకమైన పరిస్థితి నెలకొంది.  
 
 జిల్లాలో ఈసారి వివిధ రకాల పంటలు సుమారు 5.20 లక్షల హెక్టార్లకుపైగా సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికాలోపం కారణంగా యూరియా కొరత ఏర్పడి ఒకటిరెండు సంచుల కోసం రైతులు పోలీస్‌స్టేషన్‌ల వద్ద తిండితిప్పలు మాని ఉదయం నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా దొరక్క నిత్యం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా వేయలేక భారీగా పంట నష్టానికి గురయ్యారు. ప్రస్తుతం గతేడాది తాలూకు చేదు అనుభవాలు రైతులను వెంటాడుతున్నాయి.
 
 అధికారుల తనిఖీలు, హెచ్చరికలు
 జిల్లాలో యూరియా కొరత రాకుండా చూడటమే కాకుండా బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికట్టడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ జిల్లాలోని పలుచోట్ల సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకించి ఎరువుల మార్కెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించే గజ్వేల్‌లో జూన్ 13న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీలర్లవారీగా క్షుణ్ణంగా వివరాలను తెలుసుకున్నారు. యూరియా బస్తా రూ.283 ఎమ్మార్పీకి ఒక్క పైసా పెంచి అమ్మినా...క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు చేశారు. ఎమ్మార్పీకి అమ్మితే తమపై రవాణా ఖర్చుల భారం పడి నష్టాల పాలవుతామని ఇన్‌చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
 
 శరత్ మాత్రం ‘ఇష్టముంటే వ్యాపారం చేయండి..లేదంటే మానేయండి..’ అంటూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అంతేకాకుండా గజ్వేల్‌లోనే కాదు జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేయించారు. దీంతో వ్యాపారులంతా డైలామాలో పడ్డారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు యూరియాను విక్రయిస్తే చిక్కులు తప్పవని గుర్తించి లాబీయింగ్ మొదలుపెట్టారు. లారీ కిరాయి, హమాలీల పేరు చెప్పి గతంలో ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేసి దండుకున్న వ్యాపారులకు.. అధికారుల కఠిన నిర్ణయం మింగుడు పడటంలేదు.
 
 నిజానికి యూరియా బస్తా కంపెనీ వద్ద రూ.272కు లభ్యమవుతోంంది. (కొన్ని రకాల కంపెనీలకు చెందిన యూరియా బస్తాలు మాత్రం రూ.270కే లభ్యమవుతాయి) దానిని రూ.11 లాభంతో రూ.283లకు విక్రయించాలి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని మూసాపేట రేక్ పాయింట్ నుంచి ఒక్కో లారీ 340 బస్తాలు గజ్వేల్‌కు తెప్పించాలంటే కిరాయి రూ.7 వేలు వరకు చెల్లిస్తున్నామని, దీనివల్ల ఒక్కో బస్తాకు రూ.20కి పైగా ఖర్చువుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

 అంతేకాకుండా లోడ్‌ను దింపుకోవడం, రైతులకు అందజేసే వరకు ఒక్కో బస్తాపై మరో రూ.7 వరకు ఖర్చవుతోందని దీనివల్ల రూ.300కు విక్రయిస్తే.. తమకు నష్టం ఉండదనే వాదనను  తీసుకువచ్చారు. నిన్న మొన్నటివరకు బ్లాక్ మార్కెట్ చేసి లక్షలు దండుకున్న అధికారులు నిబంధనలు కఠినతరం చేసేసరికి తాము ఎక్కువ మొత్తంలో నిల్వలు తేలేమని చెబుతూ.. స్టాక్ తేవడానికి వెనుకంజ వేస్తున్నారు.
 
 వేల క్వింటాళ్ల యూరియా లోటు..
 వ్యాపారులు తీరు కారణంగా జిల్లాకు ఇప్పటివరకు రావాల్సిన వేల క్వింటాళ్ల యూరియా లోటు ఏర్పడింది. ఉదాహరణకు గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాలకు జూన్ నెలాఖరు వరకు 9,144 టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇందులో కేవలం 7 వేల టన్నులు మాత్రమే వచ్చింది.
 
 ఇందులో 6,750 టన్నులు అమ్ముడుపోగా మరో 250 క్వింటాళ్లు మాత్రమే దుకాణాల్లో అందుబాటులో ఉన్నది. వర్షం లేకపోతేనే పరిస్థితి ఇలా ఉన్నది. ఆర్థికస్తోమతలేక ఇప్పటివరకు కొన్ని వేల మంది రైతులు యూరియాను ముందస్తుగా కొనుగోలు చేయలేకపోయారు. వర్షం వస్తే వారంతా ఒక్కసారిగా రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని వెంటనే సమీక్షించి...యూరియా కొరత రాకుండా  చూడాల్సి ఉంది.
 
 బ్లాక్ మార్కెట్‌ను సహించేదిలేదు
 యూరియా బ్లాక్ మార్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలను వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. రవాణా చార్జీల సాకుతో డీలర్లు యూరియా స్టాక్ తెప్పించకపోతే...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వర్షం వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.
 -హుక్యానాయక్,జిల్లా జాయింట్ డెరైక్టర్, వ్యవసాయ శాఖ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement