‘ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదు’ | Sakshi
Sakshi News home page

‘ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదు’

Published Sun, Apr 14 2019 1:35 PM

Uttam Kumar Reddy On KCR At Ambedkar Birth Anniversery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏదీ పనిచేయదని ఒక నియంతం రాజ్యం నడుస్తోందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగా నిర్మాత, ప్రపంచ మేధావి డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ 128వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చెడు జరుగుతుందని అన్నారు. ఇక్కడ అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చేసి చెత్త డంపింగ్‌ యార్డ్‌లో పడేసినా.. సమాజంలో స్పందన రాకపోతే ఇంత నిస్తేజంగా ఉంటే రాజ్యం ఎలా నడుస్తుందని నిలదీశారు. 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ చెప్పాడని గుర్తు చేశారు.

చైనా, జపాన్‌ లాంటి దేశాలు తిరిగి నమూనాలు చూశారు కానీ మూడేళ్లైనా ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయని దద్దమ్మలు పేదలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. ఇంత నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులు చేస్తున్న ఈ పాలకులకు అంబేద్కర్‌ జయంతిని చేసే అర్హత లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు ఆ మహానుభావుడిని తాకే అర్హత కూడా లేదని ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌ దళితుడిని సీఎం చేస్తానని హామి మోసం చేశాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దళితుడుని సీఎల్పీ నేతగా చేస్తే భరించలేక రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దళిత, బహుజనుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని ఈ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సందర్భాలలో రకరకాలుగా వారిని కించపరుస్తూనే వచ్చిందని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదిన సందర్భంలో ఆ మహానాయకుడిని అవమానించి, విగ్రహానికి ఇంత దుర్గతి పట్టించిన ఈ ప్రభుత్వానికి రాజ్యాంగబద్దమైన అధికారంలో కొనసాగే హక్కు ఎంతమాత్రం లేదన్నారు.

Advertisement
Advertisement