..ఇదీ మెడి‘సీన్‌’

25 Jul, 2019 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెడికల్‌ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరం మొదలుకాబోతోంది. ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. కాలేజీలకు వచ్చేందుకు విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్‌ తరగతులు కచ్చితంగా ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభించాల్సిందే. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో కొత్తగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు చదువు చెప్పేదెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేటల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అయితే ఆ కాలేజీలకు సంబంధించి పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందే కానీ వాటిని భర్తీ చేయలేదు. మిగిలిన కాలేజీల్లో ఉన్న ఖాళీలను పూరించలేదు. కొత్త కాలేజీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగకుండా తరగతులు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు.

ఆ రెండు చోట్లే 1,036 పోస్టులు
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 2019–20 వైద్య విద్యా సంవత్సరానికి మొత్తంగా 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్‌ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఇవిగాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 1,106 డెంటల్‌ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఏకంగా వెయ్యి ఎంబీబీఎస్‌ సీట్లు పెరగడం గమనార్హం. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. మూడో విడతలో కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లతోపాటు అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌) కోసం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు కేటాయించిన 190 సీట్లను భర్తీ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండల్లో కొత్తగా ఏర్పాటైన మెడికల్‌ కాలేజీలకు ప్రభుత్వం ఇటీవల 1,036 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 132 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండగా, 904 పారామెడికల్, నాన్‌–మెడికల్‌ గెజిటెడ్‌ పోస్టులున్నాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో వైద్య విద్య సంచాలకులు వీటిని భర్తీ చేయాల్సిఉంది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలే కాలేదు. దీంతో ఆయా కాలేజీల్లో తరగతులను ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది.

ఎంహెచ్‌ఆర్బీ ఉనికిలోకే..
2017లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా సుమారు 500 డాక్టర్‌ పోస్టులు, 3,300 స్టాఫ్‌ నర్సు పోస్టులు, మరో 1,000 పారా మెడికల్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయినా ఆ భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. దీంతో లాభం లేదనుకొని తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు ‘మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఆర్బీ)’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గతేడాది సెప్టెంబర్‌లోనే జీవో జారీచేశారు. 10నెలలు కావస్తున్నా.. ఇప్పటిదాకా ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఖాళీలు పెరిగిపోతున్నాయి. సరిపడా డాక్టర్లు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతోంది. వేగంగా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎంహెచ్‌ఆర్‌బీని ఏర్పాటు చేసినా.. ఆలస్యం తప్పడంలేదు.

బోర్డు చైర్మన్‌గా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మెంబర్‌ సెక్రటరీగా, జాయింట్‌ డైరెక్టర్‌ హోదా ఉన్న అధికారి సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డులో డిప్యూటీ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్, లీగల్‌ ఆఫీసర్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకూ అందరినీ డిప్యుటేషన్‌పై ఇతర శాఖల నుంచి తీసుకోవాలని జీవో సూచించింది. అయినా ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరో నాలుగు నెలల వరకు భర్తీ ప్రక్రియ జరిపే అవకాశాలు కనిపించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయంటే అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇదే జరిగితే మెడికల్‌ కాలేజీలు అధ్యాపకులు లేక వైద్య విద్యా వ్యవస్థ కుంటుపడే ప్రమాదముంది. దీనిపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ రమేష్‌రెడ్డి వివరణ కోరగా, బోర్డు ద్వారానే భర్తీల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. 

మరిన్ని వార్తలు