'మన ఊరు బడిని బతికించుకుందాం' | Sakshi
Sakshi News home page

'మన ఊరు బడిని బతికించుకుందాం'

Published Sat, Oct 3 2015 6:05 PM

'మన ఊరు బడిని బతికించుకుందాం' - Sakshi

గూడూరు(పాలకుర్తి) : విద్యారంగంలో రాణించడం ద్వారానే ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదుగొచ్చని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. పేద వర్గాలకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం తప్పక ఉండాలని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 'వందేమాతరం ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'మన ఊరు బడిని బ్రతికించుకుందాం' అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన ఫిన్‌లాండ్ విద్యా రంగంలో ముందుండటం వల్లే అగ్ర దేశాలతో అన్ని రంగాల్లో మందంజలో ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చదువు చెబుతామనే నమ్మకాన్ని కల్గించాలని అన్నారు. గ్రామ ప్రజలు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ఉపాధ్యాయులతో సమన్వయంగా ఉంటూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. తాను పుట్టిన గ్రామంలో విద్యను ప్రోత్సహించేందుకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయడం ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు.

గూడూరు గ్రామ దళిత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి నేడు న్యూజెర్సీలో నెలసరి వేతనం రూ.15 లక్షలు సంపాదించడం గర్వకారణమన్నారు. ఆడ పిల్ల చదువు సమాజంలో ఎంతటి మార్పు తీసుకు వస్తుందో అర్థం చేసుకోవాలని కోరారు. నేడు ప్రభుత్వ పాఠశాలను ప్రజలు, ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ప్రభుత్వ విద్య బలహీన పడుతుందన్నారు.

వందేమాతరం ఫౌండేషన్ డైరక్టర్ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన కమిటితో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. విద్యాభిమానులను కలిసి విరాళాలు సేకరించి పాఠశాల తరగతి గదిలో అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఇందు కోసం వందేమాతరం ఫౌండేషన్ స్వచ్చందంగా సహకరిస్తుందని తెలిపారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement