కట్నం కోసం బాలింతను చంపేస్తారా? | Sakshi
Sakshi News home page

కట్నం కోసం బాలింతను చంపేస్తారా?

Published Tue, May 24 2016 2:35 AM

కట్నం కోసం బాలింతను చంపేస్తారా?

వరలక్ష్మి ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలి
ఠాణాను ముట్టడించిన బాధిత తల్లిదండ్రులు, బంధువులు

 
వనపర్తి టౌన్ : ‘కట్నం కోసం పచ్చి బాలింతను చంపేస్తారా.. ఈ కేసులో నిందితులను శిక్షించాల్సిందే..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు, బాధిత బంధువులు ఠాణాను నాలుగు గంటలపాటు ముట్టడించారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. పానగల్ కు చెందిన అలివేల, రాములు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నాడు. వీరి చిన్న కుమార్తె వరలక్ష్మి (22) కి మూడేళ్ల క్రితం వనపర్తి పట్టణంలోని రాయిగడ్డకు చెందిన రాఘవేందర్‌తో వివాహమైంది. ఆ సమయంలో రూ.5.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. వీరికి రెండేళ్ల కుమారుడితోపాటు పది రోజుల కూతురు ఉన్నారు.

కొంతకాలంగా ఆమెను భర్తతోపాటు అత్త అలివేలు, మామ మన్యంలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గాంధీనాయక్ కేసు దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. కాగా, నిందితులను కఠిన శిక్షించాలంటూ సోమవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వనపర్తి పోలీస్‌సేష్టన్ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ముట్టడించారు. ‘నేరం చేసిన వాళ్లను భద్రంగా ఠాణాలో పెడతారా..’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, ‘పది రోజుల పచ్చి బాలింత అని చూడకుండా భర్త, అత్త, మామలు చితకబాది చంపేశారు.. మా కడుపు కోత ఎవ రు తీరుస్తారు..’ అని బాధిత తల్లిదండ్రులు రాములు, అలివేల రోదించారు. మా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు.
 
 
ఎస్‌ఐ ఏమన్నారంటే..
వరలక్ష్మి మృతిపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నం, హత్య కింద కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ గాంధీనాయక్ తెలిపారు. బిడ్డను పోగొట్టుకున్న బాధ, ఆవేశంలో ఘర్షణలు జరుగుతాయని భావించి నిందితులకు సెక్యూరిటీ ఇచ్చామన్నారు. చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీంతో వారు శాంతించి వెనుదిరిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement