చిరుప్రాయం...ప్రమాదాల వలయం.. | Sakshi
Sakshi News home page

చిరుప్రాయం...ప్రమాదాల వలయం..

Published Thu, Feb 19 2015 12:36 AM

vehicles Drivers Neglected on driving

‘‘వాహనాల్లో బడికి వెళ్లిన బాలలు భద్రంగా ఇంటికి వస్తారా.... లేదోనన్న ఆందోళన ఎందరో తల్లిదండ్రులను వేధిస్తోంది. రోజూ ఇలాంటి సమస్యతో వారు సతమతమవుతున్నారు. నిర్లక్ష్యంగా, అర్హతలేని డ్రైవర్లు వాహనాలు నడుపుతుండటం....నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలు, మితిమీరిన వేగం, పరిమితికి మించి ఎక్కించడం లాంటి సమస్యలతో గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బంగారు భవిత కలిగిన ఎందరో ముక్కుపచ్చలారని చిన్నారులు తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలొదుతున్నారు. ఇలాంటి సంఘటనలతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చకుండా ఉండేందుకు రవాణాశాఖ వారు చర్యలు తీసుకోవాలి. మోతె మండలంలో విద్యార్థులను చేరవేసేందుకు వెళ్లిన టాటాఏస్ బోల్తాపడి చిన్నారి బలవ్వడంతో పిల్లల భద్రత మరో మారు     చర్చనీయాంశమయ్యింది. ’’                    

చిరుప్రాయం... ప్రమాదాల వలయంలో చిక్కుకుంటోంది. పాఠశాల విద్యార్థుల రక్షణ కోసం నిబంధనల చట్రం ఉన్నప్పటికీ వాటి ఉల్లం‘‘ఘను’’లతో బంగారు భవితవ్వానికి ప్రాణ సంకటంగా తయారయ్యింది. తరచూ విద్యాసంస్థల వాహనాలు ప్రమాదాలకు గురవ్వడం, చిన్నారులు ప్రాణాలొదలడం ఆందోళన కలిగించే పరిణామం. పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఆటో బస్సుడ్రైవర్లు పిల్లల భద్రతపై నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

విద్యార్థుల రవాణా వ్యవస్థ ...
జిల్లాలో పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు ఆటోలు, ఇతర వాహనాల ద్వారా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు వ్యక్తిగత వాహనాలైన కార్లు, వ్యాన్లు, టాటాఏస్‌ల వంటి వాటిని కూడా అనధికారికంగా వినియోగించడం ప్రమాదాలకు హేతువుగా మారుతోంది.

జిల్లాలో విద్యాసంస్థల వాహనాలెన్ని ?
జిల్లాలో రవాణా శాఖ గణాంకాల ప్రకారం విద్యా సంస్థల బస్సుల సంఖ్య 1224గా నమోదై ఉంది. ఇందులో ఫిట్‌నెస్ పొందినవి 1073 మంది కాగా 151 వాహనాలు ఫిట్‌నెస్ పొందలేదు. వీటిల్లో దాదాపు 100కి పైగా బస్సులు స్క్రాచ్ దశలో (కాలం చెల్లినవి) ఉన్నాయి. వీటితో పాటు 170 బస్సులు ఫిట్‌నెస్ ఊసేలేకుండా, సాంకేతిక పరమైన సమస్యలతో ఉండి కూడా విద్యార్థులను చేరవేస్తున్నాయి. విశేషమేమిటంటే ఇవి అధికారిక గణంకాలు మాత్రమే. కానీ అధికారిక సమాచారం లేకుండా కాలం చెల్లిన బస్సులు మరికొన్ని ఉన్నాయని సమాచారం. ఇవే కాకుండా జిల్లాలో 17,246 ఆటోలు ఉన్నాయి. వాటిల్లో విద్యార్థులను చేరవేసేందుకు (స్కూల్ పిల్లల కోసం) అనుమతి, రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలు జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఆయా వాహనాల్లో అనధికారికంగా విద్యార్థులను చేరవేస్తున్నారు. టాటాఏస్ వాహనాల్లో సైతం స్కూలు పిల్లలను తరలిస్తున్నారు.

ప్రమాదం జరిగితేనే ఉరుకులు, పరుగులు...
ప్రమాదం జరిగితే తప్ప రవాణాశాఖ వారు స్పందించని పరిస్థితి నెలకొంది. ప్రతీ సంవత్సరం మే నెల 15వ తేదీ వరకు విద్యా సంస్థల బస్సులకు ఫిట్‌నెస్ పూర్తి చేయడం ఓ తంతుగా ముగిస్తున్నారు.. తప్ప వాహనాల కండీషన్, అనుభవ రాహిత్య డ్రైవర్ల పట్ల తీవ్రంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వాహనాలుంటే తప్ప విద్యార్థులను ఆకట్టుకోలేమనో, ఫైనాన్స్ కంపెనీలు సులువుగా వాహనాలను సమకూర్చుతున్నాయో కానీ ప్రతీ విద్యా సంస్థ వారు బస్సులను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. కానీ డ్రైవర్ల నియామకంలోనే జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభ సమయంలో ఓ మారు అవగాహన సదస్సు పెట్టడం మినహా రవాణాశాఖ వారు డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులతో కలిపి సమావేశాలు నిర్వహించడం లేదు.

ఆటోల నిబంధనలు...
    ఆటోలలో ఐదుగురు విద్యార్థులకు మించి తీసుకెళ్లరాదు.
    ఆటోడ్రైవర్‌కు పక్కన ఇతరులు కూర్చోరాదు.
    ఆటోబయట స్కూల్‌బ్యాగులు వేలాడదీయరాదు.

నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణం
మామిళ్లగూడెం(మోతె) : డ్రైవర్ నిర్లక్ష్యం.. డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఉపాధ్యాయుడి సరదా.. వెరసి ఓ విద్యార్థినిని బలితీసుకోగా, మరో ఇద్దరిని గాయాలపాల్జేసింది. మోతె మండల పరిధిలో  టాటాఏస్ ప్రమాదానికి ఇవే కారణాలని తేలింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకున్‌గూడెం గ్రామానికి చెందిన చందన కాన్సెప్ట్ స్కూల్ పదవ తరగతి విద్యార్థినులు మోతె మండలం మామిళ్లగూడెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్‌లో నిర్వహిస్తున్న డెమో క్లాసులకు హాజరయ్యేందుకు వ్యాన్‌లో బుధవారం బయలుదేరారు. వ్యాన్‌లో పదిమంది విద్యార్థులతో పాటు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు ఉపెందర్ అలియాస్ సైదులు, డ్రైవర్ ఉప్పయ్య కూడా ఉన్నారు. వ్యాన్ మామిళ్లగూడెం శివారులోకి రాగానే  ఉపేందర్ డ్రైవింగ్ చేస్తానని పట్టుబట్టాడు. దీంతో డ్రైవర్ ఉపయ్య నిర్లక్ష్యంగా స్టీరింగ్ అతడి చేతికి ఇచ్చాడు. తెలిసీ తెలియని డ్రైవింగ్‌తో ఉపేందర్  వాహనాన్ని వేగంగా నడపడంతో వ్యాన్ ఒక్కసారికిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో  మోతె మండలం ఉర్లుగొండ పరిధిలోని రాందాస్ తండాకు చెందిన భూక్య నాగమణి(15) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. వ్యాన్‌లో ఉన్న సర్వారం గ్రామానికి చెందిన మాకిని సౌమ్య,కరక్కాయలగూడేనికి చెందిన కొత్తపెల్లి శైలజకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా విద్యార్థులకు గాయాలు కాలేదు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్, ఉపాధ్యాయుడు అక్కడి నుంచి పరారయ్యారు.  ప్రమాద విషయం తెలుసుకుని ఎస్‌ఐ శివకుమార్, ఇతర పోలీసు సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని నాగమణి మృతదేహాన్ని సూర్యాపేటకు తరలించారు.మృతురాలి తండ్రి భూక్య వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై్స తెలిపారు.

గడిచిన మూడేళ్లలో జిల్లాలో జరిగిన ప్రమాదాలు మచ్చుకు కొన్ని...
    2011 డిసెంబర్ 7న నకిరేకల్‌లో శ్రీ చైతన్య స్కూల్ బస్సు సెల్ఫ్ కోసం నెడుతుండగా ఒక్కసారిగా స్టార్టయ్యి సుజిత్ అనే విద్యార్థి మీది నుంచి పోవడంతో మరణించాడు.
    అదే రోజు నల్లగొండలో విశ్వదీప్ స్కూల్ బస్సును కొత్త డ్రైవర్ స్టీరింగ్‌ను కంట్రోల్ చేయలేక పొదల్లోకి తీసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి.
    2011 డిసెంబర్ 6న పీఏపల్లి మండలంలో స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
    2013లో భువనగిరిలో స్కూల్ బస్సు స్టీరింగ్ విరిగిపోయి ఒకరు మరణించారు. అదే విధంగా కాలేజీ బస్సు చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు.
    2014 డిసెంబరు 13న మునగాల మండలం ఆకుపాముల వద్ద స్కూలు బస్సు ప్రమాదంలో చిన్నారి శశిప్రియ మృత్యువాత పడింది.
    2015 ఫిబ్రవరి 18వ తేదీన మోతె మండలం మామిళ్లగూడెం వద్ద టాటాఏస్ వాహనం ప్రమాదంలో ఓ చిన్నారి బలి అయ్యింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement