Sakshi News home page

కాకా ఇల్లే కాంగ్రెస్ ఆఫీస్

Published Tue, Dec 23 2014 2:32 AM

Venkata swamy' home used for Congress office

ఆపత్కాలంలో ఇందిరాగాంధీకి తన క్వార్టర్‌ను ఇచ్చిన వెంకటస్వామి  
తర్వాత అదే పార్టీ ప్రధాన కార్యాలయంగా మారిన వైనం


సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశంలో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. పార్టీ మహామహులంతా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో ఇందిరకు అండగా నిలిచిన అతి కొద్దిమంది నేతల్లో వెంకటస్వామి ఒకరు. ఆనాడు ఎంపీగా కొనసాగుతున్న వెంకటస్వామి ఢిల్లీలో తాను నివసిస్తున్న క్వార్టర్‌ను ఆమెకు ఇచ్చారు. అప్పట్నుంచి వెంకటస్వామి నివసించిన 24, అక్బర్‌రోడ్‌ను కాంగ్రెస్(ఐ) పార్టీ ప్రధాన కార్యాలయంగా ఇందిర మార్చారు. నాటి నుంచి ఇందిర సన్నిహితుల్లో కాకా ఒకరిగా మారారు. నేటి వరకు కాంగ్రెస్ కార్యాలయ చిరునామా 24, అక్బర్‌రోడ్ కావడం గమనార్హం.

మరోవైపు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌తో కలసి పనిచేసినవారిలో కాకా ఒకరు. ఈ విషయాన్ని కాకా స్వయంగా మాట్లాడుతూ.. అంబేద్కర్‌తో కలసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకునే వారు. 2010 నుంచి కాకా పలుమార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండుసార్లు కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కొన్నాళ్లకు కాకా మీడియా సమావేశం ఏర్పాటు చేసి... ‘‘నేను చనిపోతానని జనమంతా అనుకున్నరు. పైదాకా పోయొచ్చిన. తెలంగాణ నా స్వప్నం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను బతికే ఉంటా’’ అని చెప్పారు. ఇటీవలి ఎన్నికల ముందు ఓ ప్రైవేటు కార్యక్రమం లో మాట్లాడుతూ ‘‘నా స్వప్నం ఫలించింది. ఇక హాయిగా చనిపోతా’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి.. తీరని కోరిక!
2004 ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన వెంకటస్వామి... ఆ తర్వాత కాలంలో రాష్ర్టపతి కావాలని కలలు కన్నారు. అందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, నాటి ప్రధాని మన్మోహన్, సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహా జాతీయ ముఖ్య నేతలందరినీ కలసి మద్దతివ్వాలని కోరారు. అయితే రాజకీయ సమీకరణల్లో భాగంగా ప్రతిభాపాటిల్‌ను రాష్ర్టపతి పదవి వరించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తర్వాత సోనియాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సోనియా..దేశాన్ని విడిచివెళ్లు’’అంటూ ఘాటు గా వ్యాఖ్యానించారు. నాటి నుంచి కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.

‘ప్రాణహితు’డు కాకాయే..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మొదటిసారి ప్రతిపాదన చేసిన వ్యక్తి వెంకటస్వామియే. ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశించిన కాకా... దీనిపై వైఎస్ రాజశేఖరరె డ్డితో పలుమార్లు చర్చించారు. కాకా ప్రతిపాదనకు వైఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ‘వైఎస్.రాజశేఖరరెడ్డి నా జీవితాశయం నెరవేర్చిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఎన్నడూ వైఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడను’’ అని పార్టీ బహిరంగ వేదికపై వ్యాఖ్యానించారు.

రామానంద తీర్థ శిష్యుడిగా..
వెంకటస్వామి చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మొదట ఆర్యసమాజ్‌లో, ఆ తర్వాత రామానందతీర్థ శిష్యుడిగా కాంగ్రెస్‌లో పనిచేశారు. సాయుధ పోరాట సమయంలో జైలుకెళ్లిన కాకా.. హైదరాబాద్ విలీనం అనంతరం రాజకీయాలు వదిలేసి కుటుంబ పోషణ కోసం కూలీ పనిచేశారు. అప్పుడే కార్మిక నాయకుడిగా ఎదిగారు. హైదరాబాద్‌లో నిలువనీడలేకుండా ఉన్న పేదల కోసం ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసి వారి కోసం పోరాడారు. ఆర్థికంగా బలపడ్డాక మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన కాకా అనేక పదవులు అలంకరించారు.

Advertisement

What’s your opinion

Advertisement