‘కరోనా’ అనుమానం.. రోడ్డున పడిన మృతదేహం | Sakshi
Sakshi News home page

‘కరోనా’ అనుమానం.. రోడ్డున పడిన మృతదేహం

Published Tue, Jul 14 2020 4:33 AM

Venkatamma Passed Away With Health Issues In Bus At Vikarabad District - Sakshi

ధారూరు/యాలాల: కరోనా.. మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్‌ సోకిందంటేనే బాధితులకు ఆమడదూరం పారిపోతున్న మనుషులు.. ఇక, మరణాల విషయంలో కనికరమే చూపట్లేదు. సోమవారం వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం కెరెళ్లి వద్ద జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. గొం తుపై ఏర్పడిన కణితితో బాధపడుతూ ఓ మహిళ బస్సులో కుప్పకూలి చనిపోయింది. కరోనాతోనే చనిపోయిందనే అనుమానంతో ఆమె మృతదేహాన్ని ఉన్నపళంగా రోడ్డుపై దించేసి డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు వెళ్లిపోయారు.

కరోనా భయంతోనే..
యాలాల మండలం కిష్టాపూర్‌కు చెందిన గడ్డం చిన్న ఆశప్ప భార్య వెంకటమ్మ (40) గొంతుపై కొన్నేళ్లుగా కణితి పెరుగుతోంది. శ్వాస తీసుకునేందుకు, భోజనం చేసేటపుడు ఇబ్బందిపడేది. కొన్ని రోజుల క్రితం ఆమెకు నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అంతకుముందు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చింది. గొంతు వద్ద కణితి తొలగించేందుకు రూ.2 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో భార్యను కాపాడుకోవడానికి ఆశప్ప తనకున్న మూడెకరాల్లో ఎకరం అమ్మి ఆపరేషన్‌ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకొని ఆశప్ప, వెంకటమ్మ తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆర్టీసీ బస్సులో తాండూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం బయలుదేరారు.

10 గంటలకు ధారూరు దాటాక వెంకటమ్మ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ చనిపోయింది. కెరెళ్లిలో బస్సు ఆపిన డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు.. మృతదేహాన్ని కిందకు దించాలన్నారు. తన భార్యకు కరోనా లేదని, గొంతు వద్ద కణితితో చనిపోయిందని ఆశప్ప చెప్పినా వారు వినలేదు. దీంతో మృతదేహాన్ని కిందికి దింపించి వెళ్లిపోయారు. ఆశప్ప రోదిస్తూ విషయాన్ని ఫోన్‌లో తన అల్లుడితోపాటు కిష్టాపూర్‌ సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌కు చెప్పాడు. చివరకు ఎలాగో ఓ ఆటో మాట్లాడుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. రోడ్డు పక్క దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న తమ పట్ల ఎవరూ జాలీ, కనికరం చూపలేదని ఆశప్ప విలపిస్తూ చెప్పాడు.

Advertisement
Advertisement