వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్ | Sakshi
Sakshi News home page

వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్

Published Tue, Jun 17 2014 2:59 AM

Videos of blackmail in the name of

  • రూ. 6.5 లక్షలు కాజేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్    
  •  నిందితుడి అరెస్టు
  •  సాక్షి, సిటీబ్యూరో: అర్ధనగ్నంగా చేసిన వీడియో చాటింగ్ దృశ్యాలను తన కంపెనీ అధికారికి దొరికాయని, వాటిని అతను ఇంటర్‌నెట్‌లో పెట్టకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్ చేస్తున్నాడని భయపెట్టి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ప్రియురాలి వద్ద రూ. 6.5  లక్షలు కాజేశాడు. సదరు మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సైబర్‌క్రైమ్ ఏసీపీ ప్రతాప్‌రెడ్డి కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన సిద్దాంత్‌రాజ్ (30), నగరానికి చెందిన యువతి (25) నగరంలోని ఒకే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేశారు.

    సిద్దాంత్‌రాజ్ తనకు పెళ్లి కాలేదని ఆమెను నమ్మించారు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని ఆమెను తన వలలో వేసుకున్నాడు.  ఆరు నెలల క్రితం సిద్దాంత్‌రాజ్ బెంగ ళూర్‌కు బదిలీ అయ్యాడు. అక్కడి నుంచే అప్పుడప్పుడు ఆమెతో వీడియో చాటింగ్ చేసేవాడు. ఓ రోజున ఇద్దరు అర్ధనగ్నంగా వీడియో చాటింగ్ చేసుకున్నారు. ఇదే ఆమెకు శాపంగా మారింది.
     
    బ్లాక్‌మెయిలింగ్...

    ఇలా చాటింగ్ చేసిన వీడియో తన ఆఫీస్‌లోని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కు చిక్కిందని ఆమెకు అబద్దం చెప్పాడు. ఆ వీడియోలను అతను ఇంటర్‌నెట్‌తో పాటు యూట్యూబ్‌లో పెడతానంటున్నాడని బెదిరించాడు. డబ్బులు చెల్లిస్తే వీడియో క్లిపింగ్‌లు ఇచ్చేస్తానంటున్నాడని ఆమెను నమ్మించాడు. దీంతో ఆ యువతి రూ.6.5 లక్షలను ఇవ్వడానికి అంగీకరించింది. ఆ డబ్బును సిద్దాంత్‌రాజ్ తన భార్య బ్యాంకు అకౌంట్‌లో వేయించుకున్నాడు.

    తిరిగి ఇలాగే మరిన్ని డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నించగా అతనిపై బాధితురాలికి అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన రాజశేఖరరెడ్డితో పాటు ఎస్‌ఐలు అశీష్‌రెడ్డి, శ్రీనివాస్‌లు బెంగళూరులో ఉంటున్న సిద్దాంత్‌రాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో అతడిని ఆదివారం అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
     

Advertisement
Advertisement