‘గన్‌’ కథా చిత్రమ్‌! | Sakshi
Sakshi News home page

‘గన్‌’ కథా చిత్రమ్‌!

Published Thu, Aug 3 2017 1:42 AM

‘గన్‌’ కథా చిత్రమ్‌!

కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. విక్రమ్‌గౌడ్‌
తనపై కాల్పులకు తానే పథక రచన చేసిన వైనం
అనంతపురం ముఠాకు రూ.50 లక్షలకు కాంట్రాక్ట్‌
కేసులో నిందితులుగా మొత్తం పదకొండు మంది
ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు
డిశ్చార్జ్‌ అయ్యాక విక్రమ్‌ అరెస్టు: సీపీ మహేందర్‌రెడ్డి


కాల్పుల పథక రచన వెనుక విక్రమ్‌ గౌడ్‌ ఉద్దేశాలివేనన్న పోలీసులు
సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ టికెట్, తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పొందడం..
  తన శత్రువులపై పోలీసుల దృష్టి పడేలా చేయడం, అప్పులవాళ్లు తన జోలికి రాకుండా చేయడం..
ఒడిశాలో మైనింగ్‌ రంగానికి సంబంధించి సాంబశివరావు దగ్గర తాను పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి తెప్పించుకోవడం..
  కొంతకాలంగా దూరంగా ఉంటున్న కుటుంబంతో పాటు స్నేహితుల నుంచీ సానుభూతి పొందటం..
గతంలో రద్దయిన ఆయుధ లైసెన్స్‌ తిరిగి పొందటంతో పాటుపోలీసులే గన్‌మన్లను ఏర్పాటు చేసేలా చేయడం..


సాక్షి, హైదరాబాద్‌
మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ తనపై తాను కాల్పులు జరిపించుకోవడం వెనుక ప్రధాన కారణాలను పోలీసులు గుర్తించారు. పథక రచన, కాల్పులకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం, ఆయుధాన్ని దాచి పెట్టడం, నిందితులకు షెల్టర్‌ ఇవ్వడం.. ఇలా ప్రతి అంశాన్నీ విక్రమ్‌ స్వయంగా పర్యవేక్షించాడని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో విక్రమ్‌తో పాటు 11 మందిని నిందితులుగా గుర్తించగా.. ఐదుగురిని అరెస్టు చేశామని, విక్రమ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగానే అరెస్టు చేస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌జోన్‌ డీసీపీలు బి.లింబారెడ్డి, ఎ.వెంకటేశ్వరరావుతో కలసి బుధవారం తన కార్యాలయంలో మీడియాకు కొత్వాల్‌ పూర్తి వివరాలు వెల్లడించారు.

సినిమాల్లో అవకాశం కోసం వస్తే..
ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలు నిర్మించిన విక్రమ్‌కు ‘క్లాప్‌ షాట్‌’పేరుతో ఓ కార్యాలయం ఉంది. ఇందులో పనిచేస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్‌ ద్వారా పులివెందులకు చెందిన ఎ.గోవింద్‌రెడ్డి విక్రమ్‌కు పరిచయమయ్యాడు. తనకు నటనపై ఆసక్తి ఉందని, నటించే అవకాశం ఇవ్వాలని కోరగా.. భవిష్యత్తులో ఇస్తానని విక్రమ్‌ చెప్పాడు. విక్రమ్‌ తనపై కాల్పులకు ఏప్రిల్‌లోనే పథకం వేశాడు. దీన్ని అమలులో పెట్టడానికి ప్రసాద్‌ ద్వారా గోవింద్‌ను సిటీకి పిలిపించాడు. తన ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసి తన పథకాన్ని వివరించాడు. దీన్ని పక్కాగా అమలు చేస్తే రూ.50 లక్షలు చెల్లిస్తానని చెప్పిన విక్రమ్‌ అడ్వాన్స్‌గా గోవింద్‌కు రూ.5 లక్షలు చెల్లించాడు. ఈ పని చేయడానికి గోవింద్‌ తనకు పరిచయస్తుడైన కదిరి వాసి ఎస్‌.నందకుమార్‌ను సంప్రదించాడు. పథకాన్ని అతడికి వివరించిన గోవింద్‌ అడ్వాన్స్‌గా రూ.3.5 లక్షలు చెల్లించాడు.

విక్రమ్‌ ఇంటికి వచ్చి కలిసిన నంద..
నందను మే నెల్లో సిటీకి తీసుకువచ్చిన గోవింద్‌ అతడిని విక్రమ్‌కు పరిచయం చేశాడు. ప్లాన్‌ను అమలు చేయడానికి అంగీకరించిన నంద తన స్వస్థలానికి వెళ్లి అనువైన వ్యక్తుల కోసం గాలించాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడైన కదిరి వాసి కె.బాబుజాన్‌ ద్వారా అదే ప్రాంతానికి చెందిన షేక్‌ అహ్మద్‌ పరిచయమయ్యాడు. ఇతడికి రూ.5 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతడి స్నేహితుడైన తాహెర్‌ ఆ ప్రాంతంలో చికెన్‌షాపు నిర్వహిస్తుంటాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చికెన్‌ దుకాణం నిర్వహించే రయీస్‌ఖాన్‌తో అతనికి పరిచయం ఉంది. గతంలో వీరిద్దరూ కలుసుకున్నప్పుడు అవసరమైతే తమ ప్రాంతం నుంచి అక్రమ ఆయుధాలు సమకూర్చుతానంటూ రయీస్‌ చెప్పాడు. దీంతో అక్కడ నుంచే ఆయుధం తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్‌ విషయాన్ని నంద బాబూజాన్‌తో పాటు తన స్నేహితుడైన కదిరికే చెందిన వెంకట రమణ అలియాస్‌ చిన్నాకు చెప్పాడు.

ఆయుధం 20 రోజుల నుంచీ విక్రమ్‌ వద్దే..
గత నెల 6న నంద నుంచి రూ.1.9 లక్షలు తీసుకున్న అహ్మద్, బాబూజాన్, చిన్నా హైదరాబాద్‌ నుంచి విమానంలో ఇండోర్‌ వెళ్లారు. అక్కడ రయీస్‌ను కలసి రూ.30 వేలు చెల్లించి ఆయుధం, తూటాలు తీసుకున్నారు. తిరిగి వచ్చేప్పుడు మిగిలిన ఇద్దరూ విమానంలోనే రాగా.. చిన్నా, రయీస్‌ స్నేహితుడైన జావేద్‌ బస్సులో హైదరాబాద్‌ వచ్చారు. బాలానగర్‌లో వీరిని కలసిన విక్రమ్‌.. ఆయుధంతో పాటు తూటాలను ఇంటికి తీసుకువచ్చి ప్లాన్‌ అమలయ్యే రోజు వరకు భద్రంగా దాచాడు. మధ్యలో నంద పుట్టపర్తి వెళ్లిపోవడంతో.. గత నెల 17న అక్కడకు వెళ్లిన విక్రమ్‌ అతడిని కలసి వచ్చాడు. గత నెల 21న నంద, చిన్నా, బాబూజాన్, షేక్‌ అహ్మద్‌ సిటీకి వచ్చి విక్రమ్‌ ఇంట్లోనే అతడిని కలసి పథకంపై చర్చించారు. 23న కదిరి వెళ్లిపోయిన నంద, షేక్‌ అహ్మద్‌ కాల్పుల తర్వాత పారిపోవడానికి అనువుగా ఉండేందుకు గోవింద్‌ని ఓ బైక్‌ కావాలని అడిగారు. అతడు ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలకు బైక్‌ ఖరీదు చేసి ఇవ్వగా.. ఆ మరుసటి రోజు దీన్ని తీసుకుని అహ్మద్‌ హైదరాబాద్‌ వచ్చి సికింద్రాబాద్‌లోని రాయల్‌ లాడ్జిలో బస చేశాడు. 25న బాబూజాన్‌ స్నేహితుడు గౌస్‌తో కలసి చంద్రాయణగుట్ట వెళ్లిన అహ్మద్‌ బైక్‌ ఇంజన్, ఛాసిస్‌ నంబర్లు కనిపించకుండా తుడిచి వేయించాడు.

గత బుధవారమే ప్లాన్‌ అమలు కావాల్సింది..
వాస్తవానికి గత బుధవారమే ప్లాన్‌ అమలు కావాల్సి ఉంది. ఆ రోజే సిటీకి వచ్చిన నంద మిగిలిన నిందితులు గౌస్, బాబూజాన్‌తో కలసి తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో విక్రమ్‌ ఇంటికి వచ్చాడు. గౌస్, చిన్నా ఇంట్లోకి వచ్చి డ్రాయింగ్‌ రూమ్‌లో కాల్పులు జరపాలని, అహ్మద్‌ ద్విచక్ర వాహనంపై బయట వేచి ఉండాలని, కాల్పుల తర్వాత కాస్త దూరంలో వేచి ఉండే నంద, బాబూజాన్‌లతో కలసి వారి కారులో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే భయాందోళనకు గురైన అహ్మద్‌ ద్విచక్ర వాహనం తీసుకుని రాకపోవడంతో పథకం అమలు వాయిదా పడింది. దీంతో నిందితుల బసను విక్రమ్‌ తన ఇంటి సమీపంలోనే ఉన్న ‘తేజ నివాస్‌’గెస్ట్‌హౌస్‌కు మార్చాడు. ఆ రోజు సమావేశమైన నిందితులు ప్లాన్‌ అమలు చేయడం సాధ్యంకాదని భావించి విరమించుకోవాలనుకున్నారు. ఆపై ప్లాన్‌ మార్చిన నంద షేక్‌.. అహ్మద్‌ ద్వారా రయీస్‌ను పిలిపించాడు. 27వ తేదీ ఉదయం బస్సులో వచ్చిన అతడిని అహ్మద్‌ ఎర్రగడ్డలోని హోటల్‌ సన్మాన్‌లో ఉంచాడు.

కాల్చేందుకు అంగీకరించిన రయీస్‌..
విషయం తెలుసుకున్న నంద కదిరి నుంచి వాహనంలో నేరుగా గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. కొంత సేపటికి విక్రమ్‌ సైతం అక్కడకు చేరుకున్నాడు. అర్థరాత్రి 1.45 గంటలకు నంద, అహ్మద్, రయీస్‌లను తన కారులో ఎక్కించుకున్న విక్రమ్‌ కాల్పుల తర్వాత పారిపోవాల్సిన రూట్‌ చూపిస్తూ రెండుసార్లు తిప్పాడు. 2.30 గంటల ప్రాంతంలో వారితో కలసి ఇంటి వద్దకు వచ్చినా.. కాస్త దూరంలో మిగిలిన వారిని దింపి విక్రమ్‌ ఒక్కడే కారులో వచ్చాడు. గేట్‌ తాళం వేయవద్దని వాచ్‌మన్‌కు చెప్పి 10–15 నిమిషాల తర్వాత వారిని పిలిపించాడు. కాల్పులు జరగబోయే గదిలోనే సమావేశమయ్యారు. ఆయుధం తీసుకువచ్చి వీరికి అప్పగించిన విక్రమ్‌ తనపై రయీస్‌ మూడు రౌండ్లు కాల్చాలని, అహ్మద్‌ మాత్రం ద్విచక్ర వాహనంపై బయట వేచి ఉండాలని చెప్పాడు. అప్పుడే నందకు మరో రూ.4 లక్షలు చెల్లించిన విక్రమ్‌.. ఆపరేషన్‌లో తనకు ప్రాణనష్టం వాటిల్లితే మిగిలిన మొత్తం మీకు రాదని, జాగ్రత్తగా చెయ్యాలని చెప్పాడు. ఇలా కాల్పులు అమలు కాగా.. పారిపోతూ రయీస్‌ తుపాకీని కొత్త చెరువులో పారేసి.. కొద్దిదూరంలో వాహనాన్నీ వదిలేసి అంతా పారిపోయారు.

కొత్త చెరువు నుంచి ఆయుధం స్వాధీనం
ఈ కేసులో విక్రమ్‌తో పాటు నంద, అహ్మద్, రయీస్, బాబూజాన్, గోవింద్, చిన్నా, గౌస్‌లను నిందితులుగా చేర్చారు. బుధవారం నాటికే ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రయీస్‌ను ఇండోర్‌లో పట్టుకోగా.. మిగిలిన వారిని వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, రూ.5.3 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిన్నా, గౌస్‌ పరారీలో ఉన్నారు. పరోక్షంగా సహకరించిన ప్రసాద్, తాహెర్, జావేద్‌ సైతం నిందితులే అని పోలీసులు చెప్తున్నారు. విక్రమ్‌ భార్య షిపాలీ తన భర్త చెప్పిందే తమకు చెప్పారని, అదే ఫిర్యాదు చేశారని, కేసులో ఆమె ప్రమేయం ఇప్పటి వరకు బయటపడలేదని పోలీసులు వివరిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన ఆయుధాన్ని కొత్త చెరువు నుంచి భారీ అయస్కాంతాల సాయంతో గురువారం ఉదయం రివకరీ చేశారు.

సినిమా స్టైల్‌లో సెల్ఫ్‌ స్కెచ్‌..
అతడు సినిమాలో చూపినట్లు ‘సెల్ఫ్‌ స్కెచ్‌’వేసుకున్నాడు విక్రమ్‌గౌడ్‌. ఈ పథకం వేసిన నాటి నుంచి విక్రమ్‌ దాన్ని ఎప్పుడు అమలులో పెట్టేద్దామా అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అసహనంతో గడిపినట్లు వెల్లడైంది. నంద మినహా మరెవరికీ నేర చరిత్ర లేదు. అంతా కొత్త వారిని ఎంపిక చేసుకుని, డబ్బు ఆశ చూపి తన పథకాన్ని అమలులో పెట్టాలని విక్రమ్‌ ఆదుర్ధా ప్రదర్శించాడు. ఈ ఆపరేషన్‌ కోసం విక్రమ్‌ రూ.14.5 లక్షల వరకూ ఖర్చు పెట్టాడు. ఈ నిందితులతో సంప్రదింపులకు విక్రమ్‌ తన సెల్‌ఫోన్‌నే వాడాడు. పోలీసుల దర్యాప్తులో విక్రమ్‌ కాల్‌ డిటేల్స్‌ ఆధారంగానే సగం చిక్కుముడి వీడింది. నిందితుల నంబర్లు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వారి కోసం గాలించారు. మరోవైపు అనేకసార్లు నిందితుల్ని ఇంటికి తీసుకువెళ్లడంతో వారిని పనిమనిషి, వాచ్‌మెన్‌ చూశారు.

పరిస్థితి పట్టించుకోని రయీస్‌..
కాల్పులకు కొన్ని నిమిషాల ముందు తనపై మూడు రౌండ్లు కాల్చాలంటూ విక్రమ్‌ చెప్పాడు. దీంతో రయీస్‌ తొలితూటాను విక్రమ్‌ కుడిచేయి ఎత్తిపెట్టి కాల్చాడు. ఆ దెబ్బకు తేరుకోలేకపోయిన విక్రమ్‌.. రెండో చెయ్యి ఎత్తలేకపోతున్నా పట్టించుకోని రయీస్‌ శరీరానికి అనుకుని ఉన్న ఎడమ చేతిపై కాల్చాడు. ఈ తూటానే పక్కటెముకల ద్వారా వెన్నుముక వరకు వెళ్లడంతో విక్రమ్‌ సోఫాలో కుప్పకూలిపోయాడు. దీన్ని పట్టించుకోని రయీస్‌... మూడో తూటా కాల్చడానికి సిద్ధమయ్యాడు. గన్‌ స్ట్రక్‌ కావడంతో అది సాధ్యం కాలేదు. ఈ తూటా పేల్చి ఉంటే విక్రమ్‌ బతికే అవకాశాలు తక్కువయ్యేవని పోలీసులు చెప్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement