ఊరు ఊగేటు | Sakshi
Sakshi News home page

ఊరు ఊగేటు

Published Sun, Mar 16 2014 2:15 AM

ఊరు ఊగేటు - Sakshi

ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో గ్రామాలలో మద్యం డంపులు పేరుకుపోతున్నాయి. ఐఎంఎల్ డిపో నుంచి లెసైన్స్ దుకాణాలకు తరలించే మద్యం నుంచి కొంత నేరుగా వ్యాపారులు బెల్ట్‌షాపులకు చేర్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ఆబ్కారీ విధానమొచ్చినా వ్యాపారులు మాత్రం సిండికేటు వీడలేదు. పాత పద్ధతిలోనే అధికారులకు మామూళ్లు చేరడం, నియంత్రణ లేనందున ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.
 
 పభుత్వం కొత్త ఆబ్కారీ విధానానికి శ్రీకా రం చుట్టినా, ఎన్నికల నేపథ్యంలో మద్యం వ్యాపారం మాత్రం పాత పద్ధతిలోనే సాగుతోంది. మద్యం దుకాణాల యజమానులు నిబంధనలను  
 

తుంగలో తొక్కి, రూటుమార్చి వ్యాపారం చేస్తున్నారు. మద్యం దుకాణాల ముందు గరిష్ట చిల్లర ధరల (ఎంఆర్‌పీ) పట్టికలను ప్రదర్శిస్తూ, లెసైన్స్ దుకాణాలకు తరలించే మద్యంలో కొంత నేరుగా డిపోల నుంచి బెల్టుషాపులకు తరలించి 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బెల్టుషా పులు మూసివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. నాటుసారా విక్రయాలపైనా అబ్కారీ శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

 యథా సిండికేట్, తథా అబ్కారీ

 మద్యం విక్రయాలపై ప్రభుత్వ విధానం మారింది. క్షేత్రస్థాయిలో మాత్రం ‘వ్యాపారం’ తీరు మారలేదు. వ్యాపారులు సిండికేట్ వీడలేదు. మామూళ్లు ఆగడం లేదు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ‘మా ఖర్చులు మాకుంటాయి కదా, చూడండి’ అంటూ సున్నితంగా మొదలైన ఎక్సైజ్, పోలీసుల మామూళ్ల దందా మళ్లీ బెదిరింపుల స్థాయి  కి చేరింది. దీంతో సిండికేట్ వ్యాపారులు అడుగడుగునా బెల్టుషాపులను నిర్వహిస్తూ ‘గరిష్ట చిల్లర ధర’కు వక్రభాష్యం చెప్తున్నారు.

ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల సరి హద్దులో బెల్టుషాపులు, నాటుసారా, దేశీదారు యథేచ్ఛగా సాగుతున్నాయి. కామారెడ్డి, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బోధన్, మద్నూరు, జుక్కల్, నిజాంసాగర్, బిచ్కుంద, భీం గల్, సిరికొండ, కమ్మర్‌పల్లి, వర్ని, గాంధారితో పాటు పలు మండలాల్లో బెల్టుషాపులను నియంత్రించడంలో ఎక్సైజ్‌శాఖ పూర్తిగా విఫలమైందంటున్నారు. సగటున 20-25 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. గతంలో ఇలాగే జరిగితే, ఏసీబీ దాడులలో ఈ  బండారం బయటపడింది. పలువురు పోలీసు, ఎక్సైజ్ అధికారులపై ఇప్ప టికీ కేసులున్నాయి. ఇంత జరిగినా కానీ మద్యం అక్రమాలలో అధికారులు నిమ్మకుండటం చర్చనీయాంశం అవుతోంది.

 బెల్టుషాపులపై ఎందుకీ ఉదాసీనత

 నిజామాబాద్, కామారెడ్డి ఈఎస్ కార్యాలయాల పరిధిలో పెద్దమొత్తంలో బెల్టుషాపులు ఉన్నట్లు అధికారుల లెక్కలే చెప్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, ఆర్మూరు, బాన్సువాడ తదితర ప్రాంతాలలో ఏళ్ల తరబడిగా యథేచ్ఛగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. కొత్త మద్యం వ్యాపారం 2012 జూలై 1 నుంచి అధికారికంగా ప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా 142 మద్యం షాపుల కోసం టెండర్లు నిర్వహిస్తే 125 షాపులకు 1,538 దరఖాస్తులు వచ్చాయి.

17 దుకాణాలకు టెండర్లు దా ఖలు కాలేదు. 125 దుకాణాల్లో 24 దుకాణాలకు ఒక్కో షెడ్యూల్ రాగా, జూలై 26న నిర్వహించిన లక్కీ లాటరీలో 101 దుకాణాలకు టెండర్లు ఖరారు చేశారు. 2013 జూలైలో ఒప్పందం ప్రకారం మద్యం షాపులకు లెసైన్స్‌లు రెన్యూవల్ కాగా, బెల్టుషాపుల దందా మాత్రం అగలేదు. ఏప్రిల్ 2న సార్వత్రిక ఎన్నికల నోఫికేషన్ వెలువడనుండగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా బెల్టుషాపులు, నాటుసారా, అక్రమ మద్యం ప్రవాహాలను అరికట్టేందుకు ఎన్నికల సంఘం సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ బెల్టుషాపులు, నాటుసారా విక్రయాలను నియంత్రించడంలో అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement