సర్పంచైనా.. కూలి మానలే! | Sakshi
Sakshi News home page

సర్పంచైనా.. కూలి మానలే!

Published Wed, Jun 25 2014 3:11 AM

సర్పంచైనా.. కూలి మానలే!

అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టం ఆమెను సర్పంచ్‌ను చేసినా.. ఆమె మాత్రం సాదాసీదాగా బతికేందుకే ఇష్టపడుతున్నారు. గ్రామానికి ప్రథమ పౌరురాలు అయినా జీవనం కోసం మొదటి నుంచీ చేస్తున్న కూలి పనులను మాత్రం వదలడం లేదు. ఓ వైపు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తూనే మరోవైపు కూలి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పరకాల మండలం రాజిపేట సర్పంచ్ తూర్పాటి ఎల్లమ్మ.  
 - పరకాల
 
కష్టపడడంలో ఆనందం


కష్టపడి పనిచేసి సంపాదించాలనే సర్పంచ్‌నైనా రోజూ కూలికి పోతున్న. కష్టపడడంలో ఆనంద ం ఉంది. రూ.30 కూలి ఉన్నప్పుడు నుంచి వెళ్తున్న. ఇప్పుడు రోజుకు రూ.180 వస్తున్నయ్. కూలికొస్తున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్న. ఉదయం ఎవరికైనా పనులుంటే చేసి తర్వాత పరకాల వచ్చి పనిచేస్తున్న. మా ఊర్లో సీసీ వేసిన. సైడ్ కాల్వలు తీసిన. గుడుంబా అమ్మవద్దని చెప్పిన.  
 - ఎల్లమ్మ, సర్పంచ్

 
పారతో సిమెంటు కలుపుతున్న ఈమె పేరు తూర్పాటి ఎల్లమ్మ. ఊరు.. పరకాల మండలంలోని రాజిపేట. చిన్నప్పటి నుంచి ఆమె కూలి పనులకు వెళ్లేది. ఎల్లమ్మ భర్త కుమార్ బోళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆయన సంపాదనకు కాస్తంత తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో పెళ్లయిన తర్వాత కూడా ఓ తాపీమేస్త్రీ వద్ద ఎల్లమ్మ మళ్లీ పనికి కుదిరింది.

ఇందులో వింతేముంది.. భార్యభర్తలు సంపాదిస్తేనే కానీ రోజు గడవని కాలం.. అని ఊరికే కొట్టిపారేయకండి. ఎందుకంటే ఆమె ఓ ప్రజాప్రతినిధి. పరకాల మండలంలోని రాజిపేట గ్రామ సర్పంచ్. అయ్యో.. ఈ మాత్రానికే ఆశ్చర్యపోతే ఎలా.. ఇంకా చాలాఉంది. చదవండి మరి.
 - పరకాల
 
గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా అదృష్టం ఎల్లమ్మ ఇంటి తలుపు తట్టింది. తలుపుతీసి ఎదురుగా ఉన్న అదృష్టాన్ని చూసి ఎగిరి గంతేయలేదు. సాదరంగా ఆహ్వానించింది. పంచాయతీ ఎన్నికల్లో రాజిపేట ఎస్సీకి రిజర్వు అయింది. ఊర్లో అందరితో మంచిగా ఉంటూ తనపనేదో తను చేసుకుపోయే ఎల్లమ్మ అప్పుడు అందరి దృష్టిలో పడింది. ఆమెను సర్పంచ్‌ను చేస్తే అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా గ్రామానికి మంచి చేస్తుందని అందరూ భావించారు. అనుకున్నదే ఆలస్యం అన్నట్టు ఆమెను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేకాదు ఉపసర్పంచ్, వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేశారు. దీంతో గ్రామంలో ఎన్నికలు నిర్వహించకుండానే పాలకవర్గం కొలువుదీరింది. అకస్మాత్తుగా వచ్చి ఒళ్లో వాలిన అదృష్టానికి ఎల్లమ్మ ఉబ్బితబ్బిబ్బయింది. పట్టలేని ఆనందంతో పొంగిపోయింది.

 భర్తకు చేదోడుగా..

 అందివచ్చిన అవకాశంతో గ్రామంలో మొదటి పౌరురాలు అయినా ఎల్లమ్మ కూలికెళ్లడం మానలేదు. ఉదయం కార్యాలయానికి వెళ్లి పనులు చక్కబెట్టుకోవడం, తర్వాత కూలికి వెళ్లడం.. ఇదీ ఆమె దినచర్య. సర్పంచ్‌నన్న అహా న్ని పక్కనపెట్టి కూలికెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. సభ లు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం కూలికి పుల్‌స్టాప్ పెడుతున్నారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. నిరక్ష రాస్యురాలైన ఎ ల్లమ్మకు సంతకం చేయడం మాత్రం వచ్చు. గ్రామాభివృద్ధికి ఈమె ఏం చే స్తుందన్న విమర్శలను పటాపంచలు చేస్తూ ఊర్లో సీసీరోడ్డు వేయిం చారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు బావిని అద్దెకు తీసుకుని గ్రామస్తులకు నీటిసమస్యలు రాకుండా చూశారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు వింటూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఈ కూలీ సర్పంచ్ ఇప్పుడు అందరికీ ఆదర్శమయ్యారు.
 

Advertisement
Advertisement