గిరి పల్లెల్లో నీటి గోస | Sakshi
Sakshi News home page

గిరి పల్లెల్లో నీటి గోస

Published Mon, Nov 10 2014 2:40 AM

గిరి పల్లెల్లో నీటి గోస - Sakshi

* చెలిమె నీటినే తాగుతున్న ప్రజలు
* పట్టించుకోని అధికారులు

నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా శాశ్వతంగా నీటి సమస్య మాత్రం పరిష్కరించలేక పోతోంది. గుక్కెడు నీళ్ల కోసం గిరి గ్రామాల ప్రజలకు పుట్టెడు కష్టాలు తప్పడం లేదు. బిందెడు నీటి కోసం వారు మైళ్ల దూరం నడిచి వెళ్తున్నారు. కాలమేదైనా వీరి క‘న్నీటి’ కష్టాలు వర్ణనాతీతం.
 
కిలో మీటరు దూరం నడవాల్సిందే..

ఉన్న చేతిపంపులు మరమ్మతుకు నోచుకోక పోవడంతో నీళ్ల కోసం కిలో మీటరు దూరం వెళ్లాల్సిందేనని గిరిజనులు వాపోతున్నారు. గ్రామ సమీపంలో ఉన్న వాగుల్లో చెలిమె నీటినే తాగు నీటిగా వాడుతూ రోగాల బారిన పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 50వేలకు పైగా జనాభా ఉండగా 374 చేతి పంపులున్నాయి. అందులో 150 మాత్రమే పని చేస్తున్నాయి. పీడబ్ల్యూఎస్ 20, ఎంపీడబ్ల్యూఎస్ 40 మంచి నీటి సంక్షేమ పథకాలు ఉండగా ఇందులో 20 నుంచి 30 మాత్రమే పని చేస్తున్నాయి.
 
కాలమేదైనా అవే కష్టాలు..
మండలంలోని పిప్రీ, కొలాంగూడ, చిన్నకుండి, అంద్‌గూడ  గిరిజన గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులకు తిప్పలు తప్పడం లేదు. ఈ గ్రామాల్లో 500 కుటుంబాలున్నాయి. పిప్రీ గ్రామంలో నాలుగు బోర్లు వేసినా ఒక టి కూడా పని చేయడం లేదు. గ్రామ సమీపంలోని ఒక చేతిపంపు సక్రమంగా పని చేయకపోవడంతో వాగు నీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. పిప్రీ కొలాంగూడ ప్రజలకు కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ గ్రామంలో అధికంగా కొలాం గిరిజనులు నివాసముంటున్నారు. అప్పటి జేసీ సుజాతశర్మ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయినా వారి కష్టాలు తీరలేదు. దీంతో చెరువు, చెలిమె నీటినే తాగుతూ రోగాల బారిన పడి మృతి చెందుతున్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అదే గ్రామానికి చెందిన ప్రేమకళ ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో ఉన్న మురికి నీటినే తాగుతున్నా అధికారుల్లో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిప్రీ, కొలాంగూడ, కుండి గ్రామాల్లో 300 పైగా ఆదివాసీ గిరిజన కుటుంబాలున్నాయి. ఈ గ్రామాల్లోని తాగు నీటి సమస్య పరిష్కరించడానికి రూ.లక్షలు ఖర్చు పెట్టినా నీటి సమస్య పరిష్కరించలేకపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
 
చర్యలు తీసుకుంటున్నాం
పిప్రీ గ్రామ పంచాయతీ పరిధిలో పిప్రీ, గోండుగూడ, కొలాంగూడ, కుండి గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్న మాట వాస్తవం. ఇప్పటివరకు నాలుగు బోర్లు వేయించాం. ఎర్ర మట్టి ఉండడంతో అవి పని చేయడం లేదు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. బావులు తవ్వించి సోలార్ ద్వారా నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నాం. కొలాంగూడ, పిప్రీలో పనులు కూడా ప్రారంభించాం. త్వరలో నీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం.
 - శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, నార్నూర్

Advertisement
Advertisement