మీరూ చూడరా..! | Sakshi
Sakshi News home page

మీరూ చూడరా..!

Published Sun, Jan 3 2016 3:14 AM

మీరూ చూడరా..! - Sakshi

* పంచాయతీరాజ్ రోడ్ల పనులపై పెద్దల ఉదాసీనత
* పట్టించుకోని డిప్యూటీ సీఎం, కలెక్టర్
* శాఖ పనితీరుపై సమీక్షలు చేయని దుస్థితి

సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ లక్ష్యాలకు అనుణంగా పనిచేయల్సిన శాఖలు ఆ పనులను విస్మరిస్తున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తీరు మరీ అధ్వానంగా ఉంది. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వ ఆశయానికి పంచాయతీరాజ్ శాఖ విఘాతం కలిగిస్తోంది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. జిల్లాకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల పునరుద్ధరణకు రూ.416 కోట్లు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలో మీ టర్ల పొడవైన బీటీ రోడ్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది. కొత్తగా 396.83 కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లు విడుదల చేసింది. అయితే, నిధులను ఖర్చు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం.. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోంది.

జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు అధ్వాన్నంగా ఉన్నదన్న విషయూన్ని గ్రహించి న ఆ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) ఎం.సత్యనారాయణరెడ్డి స్వయంగా జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహించారు. జిల్లా అధికారులు పనితీరు మార్చుకోవాలని గట్టిగా చెప్పారు. అయినా అధికారుల తీరు మా త్రం మారడం లేదు. అధికారుల తరహాలోనే రోడ్ల పను లు చేసే   కాంట్రాక్టర్ల తీరూ అలాగే ఉంది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరితో జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతోంది.

రూ.416 కోట్లతో చేపట్టిన పనుల విషయంలో జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లుగా ఉంటుండడంపై గ్రామీణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోడ్ల పనులు చేయకపోవడం, చేసినా.. కొన్ని పనులు నాసిరకంగా ఉండ డం, మరికొన్ని పనులు మధ్యలోనే నిలిపివేయడం వం టివి జరుగుతున్నా... ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ వాకాటి కరుణ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయించాల్సిన అత్యున్నత ప్రజాప్రతినిధి, పాలనాధికారి సమీక్షలు సైతం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ విభాగంలోని రోడ్ల పునరుద్ధరణ పనులు కొన్నిచోట్ల మరీ నాసిరకంగా జరుగుతున్నట్లు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ప్రభుత్వ పరంగా ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement