‘వాటర్‌గ్రిడ్’ తొలిదశకు పచ్చజెండా | Sakshi
Sakshi News home page

‘వాటర్‌గ్రిడ్’ తొలిదశకు పచ్చజెండా

Published Sat, Feb 7 2015 6:11 AM

'Water Grid', the first stage of the greenlight

సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల తొలిదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటికి అవసరమైన నిధులను మంజూరు చేస్తూ సంబంధిత ఫైళ్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సంతకం చేశారు. వాటర్‌గ్రిడ్ తొలిదశలో 14 సెగ్మెంట్లలో పనులను ప్రారంభించేందుకు రూ. 1,518.52 కోట్లను మంజూరు చేశారు.

ఈ నిధులతో ఇంటేక్‌వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, రా వాటర్ పంపింగ్ మెయిన్స్, హైటెన్షన్ విద్యుత్ సరఫరా పనులు చేపడతారు. ఇక కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి 39.272 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్ కోసం కేటాయించేందుకు నీటి పారుదల శాఖ ఆమోదం తెలిపింది. నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలనే విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనుల కోసం రూ. 14,350 కోట్ల మేర పరిపాలనా అనుమతులకు సీఎం ఆమోదం తెలిపారు. తొలిదశ పనుల్లో జూరాల రిజర్వాయర్ నుంచి కోయలకొండ వరకు 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతో పాటు సమీప ప్రాంతాలకు తాగునీరు అందిస్తారు.

Advertisement
Advertisement