యువ నాయకత్వానికి ప్రాధాన్యత: కుంతియా | Sakshi
Sakshi News home page

ఆ అధికారం నాకు లేదు: కుంతియా

Published Sat, Aug 12 2017 5:46 PM

యువ నాయకత్వానికి ప్రాధాన్యత: కుంతియా - Sakshi

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయించే అధికారం తనకు లేదని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా అన్నారు. సీఎం అభ్యర్థిని ముందే నిర్ణయించే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని, పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా శనివారం హైదరాబాద్‌ వచ్చారు. పర్యటనలో భాగంగా కుంతియా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. గాంధీభవన్‌కు వచ్చిన ఆయనకు  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ కమిటీలు, టికెట్ల కేటాయింపులో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వెల్లడించారు.

తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ప‍్రత్యేక తెలంగాణ ఇచ్చారని, అయితే టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సిద్ధాంతం లేదని కుంతియ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదని, టీఆర్‌ఎస్‌ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు నిజంగా ప్రజలపై విశ్వాసం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రతిపాదన గురించి తనకు తెలియదని, ఏదైనా ఉంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇన్‌చార్జిలు మిరాకిల్స్ చేయలేరని.. టీపీసీసీ బాగా పనిచేస్తోందన్నారు. రాహుల్ కూడా ఇదే భావనలో ఉన్నారని కుంతియా అన్నారు. పార్టీ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ నాయకత్వంలో ఎన్నికలు వెళతామని అన్నారు. కాగా కుంతియా నెలలో 15 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని మండలాల కాంగ్రెస్‌ కమిటీలతో మండల కేంద్రాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
Advertisement