ఎస్సీ, ఎస్టీల తరహాలో మైనారిటీల సంక్షేమం | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల తరహాలో మైనారిటీల సంక్షేమం

Published Tue, Nov 21 2017 2:34 AM

Welfare of minorities like SC, ST - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీల మాదిరే మైనారిటీలకు కూడా సంక్షేమ పథకాలు రూపొందించాలని.. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల అధికారులతో సమావేశమవ్వాలని మైనారిటీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిచేలా మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి వెంటనే మహారాష్ట్ర వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని, అజ్మీర్‌లో రుబాత్‌ నిర్మాణానికి ఏర్పాట్ల కోసం రాజస్థాన్‌ వెళ్లాలని మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీని కోరారు.

ముస్లింలు, ఇతర మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఇచ్చిన హామీల అమలుపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. 66 మంది ఉర్దూ అధికారులను నియమించాలని నిర్ణయించినందున, 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు ఉర్దూలో రాసే అవకాశం కల్పించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం బాగా అమలు కావాలని, బోగస్‌ విద్యా సంస్థల ఉచ్చులో పడి విద్యార్థులు నష్టపోకుండా విదేశాల్లోని అక్రిడేషన్‌ కాలేజీల జాబితా తీసుకుని ఆ ప్రకారమే సాయం అందించాలని చెప్పారు.  

వక్ఫ్‌ భూముల జాబితా కలెక్టర్లకు.. 
రంజాన్, క్రిస్మస్‌ తదితర పండుగ రోజుల్లో ఆయా వర్గాలకు సెలవివ్వాలని సింగరేణి అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. వక్ఫ్‌ భూముల రక్షణ కోసం ఇప్పటికే కలెక్టర్లను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎక్కడ వక్ఫ్‌ భూములున్నాయో జాబితా కూడా పంపామన్నారు. ఆ భూములను రక్షిస్తామని చెప్పారు. మైనారిటీ డెవలప్‌మెంట్‌ కమిషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్‌ బోర్డుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, షకీల్, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎండీ సలీం, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఉమర్‌ జలీల్, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, మైనారిటీ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ ఎండీ షఫీఉల్లా, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితారాణి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement