బీమాపై ఏదీ ధీమా | Sakshi
Sakshi News home page

బీమాపై ఏదీ ధీమా

Published Sun, Aug 17 2014 11:39 PM

where is the confident on insurence?

శంషాబాద్ రూరల్: ప్రతికూల పరిస్థితుల్లో పంటల నష్టం నుంచి  కాపాడే పంట బీమాపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రీమియం చెల్లింపు గడువుపై ఇంకా స్పష్టత రావడం లేదు. జూలై వరకు ఉన్న గడువును ఆగస్టు నెలాఖరి దాకా పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఈ విషయంపై రైతులకు సరైన సమాచారం అందడంలేదు.

ప్రస్తుతం వర్షాభావం కారణంగా మండల పరిధిలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చినుకుపై ఆశ పెట్టుకున్న రైతులు  వరి, మొక్కజొన్న పంటల సాగును భారీగా చేపట్టారు. బోర్లలో నీటిమట్టాలు తగ్గుతుండడం, వర్షాలు మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. రామంజాపూర్, ననాజీపూర్, కాచారం, మల్కారం, సుల్తాన్‌పల్లి, జూకల్, పెద్దషాపూర్, పెద్దగోల్కొండ, పాల్మాకుల, పెద్దతూప్ర, చిన్నగోల్కొండ, నర్కూడ, కవ్వగూడ తదితర గ్రామాల్లో రైతులు బోర్ల కింద వరి సాగు చేపట్టారు.

వర్షాధారంగా చాలా చోట్ల మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. వర్షాలు సాగుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ రైతులు ధైర్యం చేసి పంటలు వేశారు. రోజురోజుకు పరిస్థితులు అధ్వానంగా మారుతుండడంతో రైతులకు దిక్కు తోచడంలేదు. ఇదే సమయంలో పంటలకు బీమా చెల్లించడానికి రైతులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. కొన్ని చోట్ల రైతులు వరినాట్లు వేస్తుండగా నెల రోజుల కిందటే మొక్కజొన్న విత్తనాలు వేశారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట ఎండుముఖం పడుతోంది. బోర్ల కింద సాగు చేసిన వరి చేలు బీటలు వారుతున్నాయి. పంటల పరిస్థితిని చూస్తే రైతులకు కన్నీరాగడం లేదు. వానలు కురవక దిగుబడి రాకుంటే పంట బీమా ప్రీమియం కట్టిన రైతులకు నష్టపరిహారం వచ్చే అవకాశాలుంటాయి.

 ప్రీమియం ధరలు పెరిగే అవకాశాలు..
 పంట బీమా ప్రీమియం ధరలు పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న పంటలను గ్రామం యూనిట్ గా బీమా వర్తింపజేస్తున్నారు. మినుములు, పెసర్లు, కంది, ఆముదం, పత్తి, పసుపు పంటలను వేరుగా బీమా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం ధరలు పెంచనున్నట్లు సమాచారం. ఆగస్టు నెల సగం గడిచిపోయింది, ఇంకా ప్రీమియం గడువుపై ఉత్తర్వులు రాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement