పాఠశాలల సామగ్రి ఏమైంది?    | Sakshi
Sakshi News home page

పాఠశాలల సామగ్రి ఏమైంది?   

Published Sat, Jun 16 2018 1:01 PM

Where Is The School Equipment? - Sakshi

బెజ్జూర్‌(సిర్పూర్‌) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పాఠశాలకు ఏటా రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో పాఠశాలలో రికార్డులు భద్రపర్చేందుకు బీరువా, మూడు కుర్చీలు, చాక్‌పీస్, వాటర్‌ఫిల్టర్, తదితర సామగ్రిని కొనుగొలు చేయాల్సి ఉంటుంది. కాని సామగ్రి కొనకుండా ఈ నిధులను గతేడాది మార్చిలోనే డ్రా చేసినట్లు సమాచారం.

పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సామగ్రి లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్‌ మండలంలో 49 పాఠశాలకు సంబంధించి రూ.4.90 లక్షలు మంజూరు కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్లు కలిసి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. నిధులు డ్రా అయి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా సామగ్రి కొనుగోలు చేయకపోవడంతో అప్పట్లో దీనిపై ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది.

దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు పాఠశాలలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయులు కొంత నాసిరకం సామగ్రి కొనుగోలు చేసి ఎమ్మార్సీ కార్యాలయంలో భద్రపర్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. జిల్లా అధికారులను ఎంఈవో రమేశ్‌ ముందుగానే కలిసి మాట్లాడుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

విచారణకు వచ్చిన జిల్లా అధికారులు సైతం నామమాత్రంగా విచారణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. 46 పాఠశాలల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 22 పాఠశాలల రికార్డులను మాత్రమే తనిఖీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. 50 పాఠశాలలకుగాను కేవలం 12 మంది ఉపాధ్యాయులు ఉండగా, నలుగురు రెగ్యులర్‌ ప్రధానోపాధ్యాయులు మాత్రమే అన్ని పాఠశాలలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు.

సల్గుపల్లి పాఠశాల హెచ్‌ఎం తిరుపతికి19 పాఠశాలలకు, బారెగూడ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రవికి 18, పెంచికల్‌పేట ఉర్దూ పాఠశాల హెచ్‌ఎంకు 12, కొండపల్లి పాఠశాల హెచ్‌ఎం 7 పాఠశాలలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. వీరు సామగ్రి కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల అభివృద్ధి నిధులను డ్రా చేసిన ప్రధానోపాధ్యాయులు ఇంతవరకు సామగ్రి కొనుగోలు చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది.

దీంతో సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన నిధులు ఏమాయ్యయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై సలుగుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిని సంప్రందించగా బెజ్జూర్‌ ఎంఈవో కార్యాలయంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో నిధులు డ్రా చేయాలని మౌఖికంగా ఆదేశించడంతో డ్రా చేసి ఎంఈవోకే ఇచ్చామని తెలిపారు

. బెజ్జూర్‌ ఎంఈవో రమేశ్‌బాబును సంప్రదించగా వారం రోజుల్లో పాఠశాలలకు సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు. సామగ్రి సరఫరా చేయని పక్షంలో నిధులను యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement