మరణంలోనూ నీ వెంటే.. | Sakshi
Sakshi News home page

మరణంలోనూ నీ వెంటే..

Published Thu, Mar 2 2017 1:06 PM

మరణంలోనూ నీ వెంటే.. - Sakshi

వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం..భర్త సిమెంట్‌ పరిశ్రమలో పనిచేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగానే జీవిస్తున్నారు..పచ్చని ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. మాయదారి కడుపునొప్పి ఇంటిపెద్దను కబళించగా..పతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ ఇల్లాలూ బలవన్మరణానికి ఒడిగట్టడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో బుధవారం చోటు చేసుకుంది. 
 
► అనారోగ్యంతో భర్త బలవన్మరణం
► పతి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు తీసుకున్న సతి
► అనాథలైన ఇద్దరు చిన్నారులు
► సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో విషాదం
 
మేళ్లచెర్వు:
మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన ముడెం రాజమోహన్‌రెడ్డి(38) స్థానిక మైహోం సిమెంట్‌ పరిశ్రమలో డ్రిల్లింగ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యర్రం వెంకట్‌రెడ్డి కూతురు సరిత(28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీమంత్‌రెడ్డి (7), శ్రీజ(6) ఇద్దరు సంతానం. రాజమోహన్‌రెడ్డి రెండేళ్లుగా కడుపునొప్పితో పాటు మానసికంగా బాధపడుతున్నాడు. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కూడా చేయించుకుంటున్న ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి రాజమోహన్‌రెడ్డికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో మనస్తాపానికి గురై  ఇంటికి దగ్గరిలోని కాలువకట్ట వద్దకు వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
విగతజీవుడైన భర్తను చూసి..
తెల్లవారుజామున భర్త ఇంట్లో కనిపించకపోవడంతో సరిత ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని బంధువులకు తెలిపి వెతకసాగింది. చివరకు గ్రామ శివారులోని కాల్వకట్ట వద్ద భర్త విగతజీవుడిగా పడి ఉండడాన్ని సరిత గమనించి బోరున విలపించింది. నీవులేని లోకంలో నేనూ ఉండలేనంటూ మృతదేహం పక్కనే ఉన్న పురుగులమందు డబ్బాను తీసుకుని తాగింది. బంధువులు గమనించి సరితను  స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా మృతిచెందింది. 
 
అనాథలైన ఇద్దరు చిన్నారులు 
రాజమోహన్‌రెడ్డి, సరిత ఆత్మహత్యకు పాల్పడడంతో వారి పిల్లలు శ్రీమంత్‌రెడ్డి, శ్రీజలు అనాథలుగా మారారు. తమ తల్లి దండ్రులు చనిపోయారన్న సంగతి వారికి అర్థంగాక అమాయకంగా అక్కడికి వచ్చిన వారి వైపు దీనంగా చూస్తుండడం చూపరులను కంటతడిపెట్టించాయి. తల్లిదండ్రుల క్షణికావేశానికి ఇద్దరు పిల్లలు దిక్కులేని వారుగా మిగిలారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దంపతుల మృతితో గ్రామంలోవిషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు కోదాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి తండ్రి యర్రం వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ.రవికుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement