తెలంగాణ భాషను కాపాడుకుందాం | Sakshi
Sakshi News home page

తెలంగాణ భాషను కాపాడుకుందాం

Published Wed, Oct 8 2014 2:34 AM

తెలంగాణ భాషను కాపాడుకుందాం

* మన సంస్కృతికి జర్నలిస్టులు జీవం పోయాలి
* రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు
* నవ తెలంగాణ నిర్మాణంలోనూ చొరవ చూపాలి
* ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్  రామచంద్రమూర్తి

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ భాషను, యాసను కాపాడుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీదే ఉందని, జర్నలిస్టులు తెలంగాణ భాషలోనే కథనాలు రాసి మన సంస్కృతికి జీవం పోయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా తొలి మహాసభలకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పత్రికల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో సెన్సేషన్ వార్తలు రాయాలనే తాపత్రయంతో వాస్తవాలను దారి తప్పిస్తున్నారని ఆయన అన్నారు.
 
  సద్విమర్శలు స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు. తప్పుచేస్తే మీడియా వదిలిపెట్టదనే భావన తీసుకురావాలని సూచించారు. సద్విమర్శలతోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసి చూపిస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల సమాచారాన్ని కూడా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలాంటి సీఎం కాదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిద్ర లేకుండా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని హరీశ్‌రావు అన్నారు.  కేసీఆర్ ప్రతిరోజూ రెండు గంటలపాటు 12 పత్రికలను చదువుతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కొనసాగిన 14 ఏళ్ల కాలంలో ఉద్యమం గురించి తప్ప.. కనీసం కుటుంబం గురించి కూడా ఆలోచన చేయలేదని గుర్తు చేశారు.
 
 ఐఏఎస్‌లు లేక పనులు సాగడం లేదు..
 ‘రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కానీ వాటిని అమలు చేయడానికి తగినంతమంది ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేకపోవటంతో పనులు ముందుకు సాగడం లేదు, ప్రభుత్వం ఒంటికాలు మీదనే పరుగు పెడుతోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రానికి 140 మంది వరకు ఐఏఎస్ అధికారులు అవసరం ఉండగా ప్రస్తుతం మనకు కేవలం 60 నుంచి 65 మంది ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారని, మళ్లీ కొందరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని ఆయన చెప్పారు.  కీలకమైన శాఖలకు కూడా ఇన్‌చార్జ్ కమిషనర్లతోనే నెట్టుకురావాల్సి వస్తుందని అన్నారు. జనార్దన్‌రెడ్డి అనే ఐఎస్‌ఎస్ అధికారికి  8 శాఖలు కేటాయించడం జరిగిందని, తీరా ఆధికారిని ఆంధ్రకు కేటాయించారని ఇక పనులు ఎలా సాగుతాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఐఏఎస్‌ల పంపకాల ప్రక్రియ  పూర్తిచేస్తుందో, ప్రధాన మంత్రి ఆ ఫైల్ మీద ఎప్పుడు సంతకం చేస్తారో... మన రాష్ట్రంలో ఐఏఎస్‌ల సమస్య ఎప్పుడు తీరుతుందోనని అన్నారు.
 
  మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలి:  డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
 డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలని, జిల్లాలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేకపోవడం విచారకరం అని అన్నారు.  ఐజేయు నాయకులు, విశాలాంధ్ర ఎడిటర్  శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  కేరళ తరహాలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్‌అలీ,  ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ రాజమణి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 పాలకుల పొరపాట్లను సరిచేసే బాధ్యత జర్నలిస్టులదే
 తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు చూపించిన చొరవను.. నవ తెలంగాణ నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ చూపించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్  రామచంద్రమూర్తి అన్నారు. పాలకులు ఎలాంటి పొరపాట్లు చేసినా.. వాటిని సరిచేసే బాధ్యత  జర్నలిస్టులపైనే ఉందని తెలిపారు. ఈ గురుతర ధర్మాన్ని నిర్వర్తించడానికి జర్నలిస్టులు నిబద్ధతతో ఉండాలని, విషయంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. నాయకులు సద్విమర్శలు స్వీకరిస్తేనే సమాజగతిలో మార్పులు చోటుచేసుకొని, అభివృద్ధికి పునాదులు పడతాయన్నారు. ‘స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం భారతావనికి జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.. ఆయన పాలన తీరుపై ఒక్క సద్వివిమర్శ కూడా రాకపోవడంతో.. తానేమైనా నియంతగా వ్యవహరించానా?’ అని  ఆయన ఆత్మ విమర్శ చేసుకున్నారని గుర్తుచేశారు. ఇలా ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శతో తప్పులు సరిదిద్దుకొని గమ్యాన్ని నిర్దేశించుకున్న నేత లే లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement