ప్రసన్నం చేసుకుంటేనే.. | Sakshi
Sakshi News home page

ప్రసన్నం చేసుకుంటేనే..

Published Thu, Dec 3 2015 1:21 AM

With a post that is not dominated power in ib

లేని పోస్టుతో ఐబీలో అధికారం చెలాయింపు
పర్సంటేజీలు ఇస్తేనే ఫైల్ ముందుకు
ఉన్నతాధికారి అండతో ఇష్టారాజ్యం
‘మిషన్’పై కూపీ లాగుతున్న ఏసీబీ

 
వరంగల్ : చిన్న నీటి పారుదల శాఖలో ముఖ్యమైన పోస్టులో ఉన్న ఉద్యోగిని ‘ప్రసన్న’ం చేసుకుంటే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగంలోకి వచ్చిన నాటి నుంచి సర్కిల్ కార్యాలయంలో తిష్ట వేయడంతో ఆమె చెప్పిందే వేదంగా సాగుతోంది. ఏ ఉన్నతాధికారి వచ్చినా సరే సదరు అధికారిచెప్పిందే అమలు  కావాల్సిందే. పనులు టెండర్లను ఓకే చేయడం... కాదన్న వారిపై అనర్హత వేటు వేయడం... వాయిదా వేయడం వంటి పనులు సదరు అధికారికి వెన్నతో పెట్టిన విద్య. మిషన్ కాకతీయ పథకం అమలులో భాగంగా వరంగల్ సర్కిల్ ను ప్రభుత్వం రెండుగా విభజించింది. ఈ విభజనలో సీనియారిటీ ఎక్కువ ఉన్న వారు తప్పనిసరిగా ఖమ్మం సర్కిల్‌కు వెళ్లాల్సి ఉంది. అయినా ఉన్నతాధికారి అతి విశ్వాసంగా ఉం టున్నందున ఆమె ఇక్కడే ఉండిపోయింది. సర్కిల్ కార్యాలయంలో ఆమెకు మరో మహిళా ఇంజనీర్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిషన్ కాకతీయలో సర్కిల్ పరిధిలోని పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ సందర్భంగా పర్సెంటెజీలు సంబంధిత సెక్షన్లకు ఇచ్చినప్పటికీ ఈ మహిళా ఇంజ నీర్లకు అదనంగా పర్సంటెజీల రూపంలో సమర్పించుకోవాల్సిందే. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

 నిబంధనలకు విరుద్ధంగా..
 సర్కిల్ కార్యాలయంలో టెండర్ల నిర్వహణలో భాగంగా ప్రస్తుతం అనధికారికంగా కొనసాగుతున్న టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టు లేదు. అయితే టెండర్ల నిర్వహణలో శాఖలో అనుభవం ఉన్న ఓ సీనియర్ ఇంజనీర్(ఈఈ పదోన్నతిలో ఉన్న) టెక్నికల్ విభాగంలో విధులు నిర్వహించేందుకు ఉన్నతాధికారి నియమించుకుంటారు. ఎస్‌ఈ కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇద్దరు డీఈఈ(టెక్నికల్)లను సమన్వయం చేసుకుంటూ ఈ సీనియర్ ఇంజనీర్ టెండర్ల అర్హతలను పర్యవేక్షిస్తారు. డీఈఈలపై అధికారం చెలాయిస్తున్నందున ఈ పోస్టుకు అనధికారికంగా  టెక్నికల్ సూపరింటెంటెంట్ పేరుతో కొనసాగిస్తున్నారు. సదరు ‘ప్రసన్న’ం ఈ పోస్టులో కొనసాగడం నిబంధనల ప్రకారం విరుద్ధం. ఒక జూనియర్ ఇంజనీర్ స్థాయి ఉద్యోగి ఇద్దరు డీఈఈలపై పెత్తనం చెలాయించడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయినా ఉన్నతాధికారి అండ ఉండడంతో సీనియర్లు సైతం మిన్నకుండిపోతున్నారు.
 
టెక్నికల్ బ్యాచ్‌కు అదనం
 మిషన్ పనులు ఇబ్బడి ముబ్బడిగా మంజూరు కావడంతో డివిజన్ల నుంచి వచ్చే ఎస్టిమేట్లు పరిశీలించేందుకు సర్కిల్‌లో డివిజన్‌కు ఒక్కో ఏఈలను నియమించారు. వీరందరితో సదరు అధికారి ‘ప్రసన్న’ం సర్కిల్‌లో టెక్నికల్ బ్యాచ్‌ను తయారుచేసింది. వీరి పరిశీలనకు వచ్చిన ఎస్టిమేట్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓకే చేయాలంటే ఒక శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అసలే 10నుంచి 30శాతం వరకు తక్కువగా టెండర్లలో పొందామని, అగ్రిమెంట్‌కు కార్యాలయంలోని అధికారులకు ఇస్తుంటే మరో శాతం టెక్నికల్ బ్యాచ్‌కు ఇవ్వాలంటే కుదరదని అన్న కాంట్రాక్టర్లు చుక్కలు చూడాల్సిందే. అర శాతం ఇస్తామని సదరు కాంట్రాక్టర్లు అంటే కుదరదని చెప్పడంతో గత్యంతరం లేక సమర్పించుకుంటే కానీ అగ్రిమెంట్లు, మంజూరు జరగని పరిస్థితులు సర్కిల్‌లో నెలకొన్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి.
 

Advertisement
Advertisement