ఒక్కరోజులో దర్శక, నిర్మాతలు | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో దర్శక, నిర్మాతలు

Published Wed, Nov 19 2014 3:37 AM

ఒక్కరోజులో దర్శక, నిర్మాతలు - Sakshi

శాతవాహన యూనివర్సిటీ : నిన్నటివరకు సాదాసీదాగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నేడు ఏకంగా ఓ సినిమాకు దర్శక, నిర్మాతలుగా మారారు. అందులోనూ సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో రానున్న చరిత్ర అనే సినిమాకు.

దీంతో ఎవరా దర్శకుడు.. ఎవరా నిర్మాత..? వీరెవరు..? సినిమాకు వీరెలా దగ్గరయ్యారు? అనే ప్రశ్నలు జిల్లా ప్రజల్లో మెదలడం సహజం.. ‘సాక్షి' ఆధ్వర్యంలో ‘కరీంనగర్‌లో న్యూ ఫిల్మ్ ఇండ స్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ చర్చా గోష్టిలో పాల్గొనేందుకు సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రావడం.. ఆయనను చూసేందుకు భారీసంఖ్యలో అభిమానులు, ఔత్సాహికులు తరలిరావడం.. సినిమారంగంపై ఆసక్తి ఉన్న ఇద్దరిని వేదికపైకి పిలవడం, దర్శక, నిర్మాతలను ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. చరిత్ర సినిమాకు సిద్దార్థ దర్శకత్వం వహిస్తాడని, ఎడ్ల అశోక్ నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ పేర్కొనడంతో అందరి దృష్టి ఆ ఇద్దరిపై పడింది.

వారేవీరు.. రేడియం స్టిక్కర్స్ ఆర్టిస్ట్ నుంచి..
 చరిత్ర సినిమాకు దర్శకత్వం వహించనున్న సిద్దార్థది బెజ్జంకి మండం శీలపూర్. పుట్టి.. పెరిగింది కుగ్రామమైనా.. ఆయన ఆలోచనలన్నీ సినిమాపైనే. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన పదో తరగతి చదివి హైదరాబాద్ బస్సెక్కాడు. అక్కడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. అసిస్టెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకున్నాడు. అవకాశాలు.. ప్రోత్సాహం లేకపోవడంతో తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు.

తన ఆలోచనలకు విలువ ఇచ్చే స్నేహితులున్న కోహెడ మండలకేంద్రంలో ఆర్టిస్ట్‌గా.. రేడియం వర్క్స్ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ‘అపర్ణ నా ప్రాణం’ అనే షార్ట్‌ఫిల్మ్‌తోపాటు ‘పిల్లో మధుబాల’ అనే ఆల్బమ్ చేస్తూనే.. ‘చరిత్ర’ టైటిల్‌తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. నటీనటుల ఎంపిక, ప్రొడ్యూసర్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో వర్మ చేసిన ప్రకటన ఎదురొచ్చినట్లయ్యింది. తన సినిమా ఇతివృత్తాన్ని చర్చాగోష్టిలో వర్మకు వినిపించడం.. దానికి తన సహకారం ఉంటుందని ప్రకటించడంతో సిద్దార్థ క్షణకాలంలో దర్శకుడిగా మారిపోయాడు.

 టీస్టాల్ నుంచి సినీ నిర్మాతగా...
 నిర్మాతగా ఎంపికైన ఎడ్ల అశోక్ కరీంనగర్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తూనే ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనంతరం పదేళ్లు పత్రికారంగంలో పాత్రికేయుడిగా పనిచేశారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరంలో అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం.. స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌కు పోటీపడడం.. అందులో విజయం సాధించడం.. వెంటవెంటనే జరిగిపోయాయి.

అప్పటినుంచి రాజకీయాల్లోనే కొనసాగుతున్న ఆయన రామ్‌గోపాల్‌వర్మ నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్నాడు. చరిత్ర సినిమాకు తన సహకారం ఉంటుందని వర్మ ప్రకటించడం.. నిర్మాతగా ఎవరైనా ముందుకురావాలని కోరడం.. దానికి అశోక్ ముందుకురావడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఈ మాజీ కార్పొరేటర్ ఒక్క రోజులోనే నిర్మాతగా పరిచయమయ్యాడు. చరిత్ర సినిమా నిర్మాణానికి సంబంధించిన పూర్తి విషయాలను చర్చించడానికి రాంగోపాల్‌వర్మ హైదరాబాద్ రావాలని సూచించినట్లు అశోక్ తెలిపారు.
 
 ప్రతిభ చూపిస్తా...
 గతంలో నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశా. అనుకున్న స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో స్వతాహాగా చిత్రాన్ని చే యాలని ఆలోచిస్తున్న. ఈ క్రమంలో ‘చరిత్ర’కు శ్రీకారం చుట్టాను. ‘సాక్షి’  రాంగోపాల్‌వర్మతో నిర్వహించిన చర్చాగోష్టితో బంగారంలాంటి అవకాశాన్ని తెచ్చింది. నా ప్రతిభను ఈ సినిమా ద్వారా చూపిస్తా. నాకు వర్మ అవకాశం ఇవ్వడం ఎంతో బలాన్నిచ్చింది.
 - సిద్దార్థ, దర్శకుడు
 
 నమ్మలేకపోతున్నా!
 చిన్నప్పటి నుంచి వర్మ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు నిర్మాతగా అవకాశం వచ్చిందంటే ఇంకా నమ్మలేకపోతున్నా. ఆనాటి శివ సినిమా నుంచి నే టి వరకు నా హీరో రాంగోపాల్‌వర్మనే. ఆయనే నాతో సినిమా విషయాలు ముచ్చటించడం ఆనందం. దీనికి సహకరించిన సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు.
 ఎడ ్ల అశోక్, నిర్మాత

Advertisement

తప్పక చదవండి

Advertisement