ఫేస్‌ బుక్కయ్యాడు | Sakshi
Sakshi News home page

ఫేస్‌ బుక్కయ్యాడు

Published Thu, May 11 2017 4:37 AM

ఫేస్‌ బుక్కయ్యాడు - Sakshi

గోవాలో హోటల్‌ రూమ్‌ బుకింగ్‌ కోసం రూ.21వేలు బదిలీ
సైబర్‌ పోలీసులకు బాధితుని ఫిర్యాదు
మాదాపూర్‌లో యువతి అరెస్టు


సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌ ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకొని వారి అవసరాలను ఆసరగా చేసుకొని డబ్బులు లాగుతూ మోసం చేస్తున్న ఓ యువతిని నగర సైబర్‌ క్రైమ్స్‌ మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సెల్‌ఫోన్, రూ.మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం...మూసాబౌలికి చెందిన శుభమ్‌ గుప్తాకు ఫేస్‌బుక్‌లో వినమ్రత గోమ్స్‌ అనే యువతితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె గోవాలో ఉన్నట్టుగా చాట్‌ ద్వారా తెలుసుకున్నాడు.

 ఏప్రిల్‌ నెలలో గోవా టూర్‌కు వెళ్లాలనుకున్న శుభమ్‌ గుప్తా అక్కడ హోటల్‌లో ఉండేందుకు వినమ్రత సహాయాన్ని అడిగాడు. ఆమె వెంటనే హోటల్‌ రూమ్‌ అద్దెకు ఇప్పిస్తానని చెప్పడంతో 21,000లు ఆమె బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత హోటల్‌ నుంచి రూమ్‌ బుకింగ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం అందకపోవడంతో వినమ్రతకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు నగర సైబర్‌ క్రైమ్‌ సెల్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 ఆమె ఫేస్‌బుక్‌ ఐడీ, సెల్‌ నంబర్ల ఆధారంగా నిందితురాలు మాదాపూర్‌లో ఉంటున్నట్లుగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. గతంలో గోవా, పుణేలోని హోటళ్లలో పనిచేసిన వినమ్రత ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. ఫేస్‌బుక్‌లో యువకులతో పరిచయాలు పెంచుకొని వారిని నమ్మించి డబ్బులు లాగుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈమెపై ఇప్పటికే మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లోనూ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement