కన్నీళ్లను దిగమింగుతూ.. | Sakshi
Sakshi News home page

కన్నీళ్లను దిగమింగుతూ..

Published Mon, Dec 11 2017 11:31 AM

Women doing wool tasks for their sons - Sakshi

ఉబికి వచ్చే కన్నీటిని కను రెప్పలతో అదిమి పడుతూ... తరుముకు వచ్చే దు:ఖాన్ని గరళంలో దిగమింగుతూ... ఏవో కారణాలు కావొచ్చు.. మరేవో విభేదాలు కావొచ్చు.. భర్తకు దూరంగా ఉంటూ... తన పిల్లల భవిష్యత్‌ కోసం బతుకు బండిని లాగడానికి.. కన్నీటి కడలిలో నావలా...  రేయింబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుంటోంది ఓ ఇల్లాలు. యుక్త వయస్సులో నయవంచకుల మాటలు నమ్మి మోసపోయి పెళ్లి చేసుకుని కొడుకును కన్నది. భర్త దరి చేరనీయకపోవడంతో కొడుకు పుట్టినప్పటి నుంచి కన్నవారి నీడనే ఆశ్రయం పొందుతోంది. కూలీ పనులు చేసుకుంటూ... బిడ్డను చదివిస్తూ.. ఎప్పుడు కట్టుకున్నవాడు కరుణించి దగ్గరకు తీసుకుంటాడో అనే నమ్మకంతో బతుకు వెళ్లదీస్తున్న మరో మహిళ కష్టాలు వర్ణణాతీతం.

మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన గాజుల సుజాత ఐదుగురు అక్కా చెల్లెళ్లలో చివరి సంతానం. ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. కాలక్రమంలో అందరి పెళ్లిళ్లు అయ్యాయి. అందరిలాగే సుజాత కూడా జీవితంపై ఏవేవో బంగారు కలలు కన్నది. ఆమెకు కూతురు రచన, కుమారుడు దినేష్‌ ఉన్నారు. సంతోషంగా అందరిలా జీవించాలనుకున్నది. కాలం ఆమె జీవితంపై చిన్నచూపు చూసింది. ఏవో కొన్ని కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. కష్టాల సుడి గుండంలో చిక్కుకున్న సుజాత జీవితాన్ని గట్టెక్కించడానికి పుట్టింటివారు అండగా నిలిచారు. పుట్టినిల్లు మిరుదొడ్డిలోనే సుజాత తన పిల్లలతో కాలం వెళ్లదీస్తోంది. మిరుదొడ్డిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఆమె పిల్లలు రచన 8వ తరగతి, దినేష్‌ 6వ తరగతి చదువుతున్నారు. పిల్లలు కూడా పరిస్థితులకు అణుగుణంగా మెదులుతున్నారు. తల్లి పడుతున్న అష్టకష్టాలను చూసి ఎక్కువ ఆడంబరాలకు పోకుండా శ్రద్ధగా చదువుకుంటున్నారు.

పిల్లల భవిష్యత్‌ కోసం... వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటోంది. ఉండటానికి ఇల్లు లేక.. కిరాయి ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. బతుకు భారాన్ని తన భుజస్కందాలపై మోయడానికి సుజాత బీడీలు చుడుతోంది. వెన్ను నొప్పులు, మెడనరాల నొప్పు లు వంటి ఆరోగ్య సమస్యలు వెంటా డుతున్నా... సర్కారు దవాఖా నా మందులతో న యం చేసుకుంటూ దు:ఖాన్ని దిగమింగుతోంది. సమయం చిక్కినప్పుడల్లా వ్యవసాయ కూలీగా మారుతోంది. రెక్కలుముక్కలు చేసుకుని ఇల్లు గడవడానికి కష్టపడుతోంది. ఉపాధి కూలీ పనులు చేస్తూ పైసాపైసా కూడబెట్టుకుంటోంది. ఇంటి కిరాయి నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, నోటు బుక్కులు సమకూరుస్తోంది. పుట్టింటివారి నుంచి కొండంత అండ లభించడం ఆమెకు కాస్త ఊరటనిస్తోంది. లేదంటే తన బతుకు మరోలా ఉండేదని కన్నీటిపర్యంతమవుతోంది సుజాత. పిల్లల భవిష్యత్‌ కోసం పరితపిస్తున్న సుజాత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

కన్నవారి నీడనే బతుకు..
హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండలం గాంధీనగర్‌ గ్రామానికి చెందిన గంగారపు స్వప్న, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. తరువాత పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసి ఇంటికి పంపించారు. అత్తారింట వేధింపులు భరించలేక పుట్టేడు దు:ఖంతో పుట్టింటికి చేరింది స్వప్న. ఆవేశంలో వెళ్లగొట్టినా... ఎప్పుడైనా ఆదరిస్తాడనే నమ్మకంతో పుట్టింటి నీడనే బతుకు వెళ్లదీస్తోంది. 15 ఏళ్ల క్రితం ఓ కొడుకు జన్మనిచ్చినా... తండ్రి దగ్గరకు తీయలేదు. ఆ తల్లీబిడ్డలను కనికరించలేదు. కూలీ పనులు చేసుకుంటూ కొడుకు సాదుకుంటోంది. న్యాయం కోసం తిరగని పోలీస్‌స్టేషన్‌ లేదు, అడగని అయ్యా లేడు. ఎక్కడా న్యాయం జరగలేదు. చివరి ప్రయత్నంగా వెంటెనెన్స్‌ కోసం కోర్టును ఆశ్రయించినా... కేసు కోర్టులోనే ఉంది. కనీపెంచిన అమ్మానాన్నలు బిడ్డ సంతోషంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసి ఫలించ లేదు. ఆమె తండ్రి వృద్ధుడు కావడంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. కూలీ పనులు చేద్దామంటే నడుం నొప్పి ఆమెను వేధిస్తోంది. ఇంటి దగ్గరనే ఉంటూ బీడీలు చేస్తూ కొడుకు సాదుకుంటోంది. ఆ దేవుడు కరుణించి బుతుకులు ఎప్పుడు మారుస్తాడని ఎదురు చూస్తోంది. మా ఒంటరి బతుకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే కిరాణం కొట్టు పెట్టుకొని ఉపాధి పొందుతామని ఆశిస్తోంది స్వప్న. 

Advertisement

తప్పక చదవండి

Advertisement