మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Published Wed, May 30 2018 10:14 AM

Women should develop economically

కుల్కచర్ల: డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడుతాయని రాష్ట్ర సెర్ప్‌ సీఈఓ పౌసమిబసు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దఅంతారం గ్రామంలో డీఆర్‌డీఏ, సెర్ప్, తెలగాణ పల్లె ప్రగతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాడి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో శ్రీనిధి నిధులతో ఏర్పాటు చేసిన మేకల పెంపక కేంద్రాలను పరిశీలించారు.

గ్రామంలో రూ. 9 లక్షలతో 18 మంది ఎస్సీ మహిళలకు మేకలు ఇప్పించి పెంపకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడారు. మేకల పెంపకంలో మంచి లాభాలు రావడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మేకలను నిత్యం షెడ్లలోనే ఉంచి మంచి పోషకాలున్న మేతను అందించాలన్నారు. అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆమె డీఆర్డీఏ అధికారులకు సూచించారు.

అనంతరం  గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో  పండించే పంటలు, మార్కెటింగ్‌పై ఆరా తీశారు. ఇప్పటికీ చాలామంది పాతపద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాని, దీంతో లాభాలు రావడం లేదన్నారు. పండించిన పంట దళారులు కొనుగోలు చేసి వాటి ద్వారా వారు మంచి లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. రాగులు, జొన్నలు, పెసర, బెబ్బర, మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వం  కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నూతన పద్ధతులు పాటించేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అభివృద్ధి చెందే పనులు చెప్పాలని సూచించారు. పింఛన్లు, రేషన్, బ్యాంక్‌ రుణాలు అందుతున్నాయా.. లేదా అని ఆరా తీశారు. అంతారంలో బ్యాంక్‌ రుణాలు తీసుకుని నిర్వహిస్తున్న చిరువ్యాపారాలను ఆమె పరిశీలించారు.

అంతకుముందు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  మానసిక వికలాంగుల కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ జాన్సన్, అంతారం సర్పంచ్‌  పుష్పలత, ఎంపీడీఓ తారీక్‌ అన్వర్, సూపరింటెండెంట్‌ ఇంద్రసేనా, ఏపీఎం మల్లికార్జున్, ఎపీఓ శోభ, సెర్ప్‌ అధికారులు ఉన్నారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement