మహిళాశక్తిని చాటాలి | Sakshi
Sakshi News home page

మహిళాశక్తిని చాటాలి

Published Sun, Mar 8 2015 2:07 AM

womens day

కరీంనగర్ స్పోర్ట్స్ : అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళా శక్తిని చాటాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రెవెన్యూ క్లబ్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారన్నారు. క్రీడలతో మానసికోల్లాసం కలిగి పని ఒత్తిడి తట్టుకుంటారన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధిలో జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని అన్నారు. టీఎన్జీవోలకు ఆర్థికసాయం అందించి బలోపేతం చేస్తామన్నారు. స్వశక్తి సంఘాల ఏర్పాటు తర్వాత మహిళలు ఆర్థికంగా ఎదిగి చైతన్యవంతులయ్యారన్నారు. కలెక్టర్ షటిల్, మ్యూజికల్ చైర్ పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు హమీద్, సెక్రటరీ జగదీశ్వర్, ఉపాధ్యక్షులు నర్సింహస్వామి, రాజయ్యగౌడ్, నర్సయ్య, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, సుజాత, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
 
 మహిళలకు ప్రాధాన్యతంటే ఇదేనా?
 మహిళా దినోత్సవం పోటీల ప్రారంభ కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యతనివ్వలేదని పలువురు విమర్శించారు. స్వశక్తి కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి మాట్లాడుతూ వేదికపై అందరూ పురుషులకే చోటు కల్పించి, మహిళలకు పక్కన చోటు కల్పించడం ఏంటని ప్రశ్నించారు. డెప్యూటీ ఎస్‌వో లక్ష్మి మాట్లాడుతూ కలెక్టరేట్‌లో మహిళలకు టాయిలెట్ సౌకర్యం లేకుండా పోయిందని వాపోయారు. వెంటనే స్పందించిన కలెక్టర్ టాయిలెట్ సహా మహిళల సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 

Advertisement
Advertisement