‘కల్లు గీత’పై ‘రియల్‌’ వేటు! | Sakshi
Sakshi News home page

‘కల్లు గీత’పై ‘రియల్‌’ వేటు!

Published Wed, Jul 3 2019 1:23 PM

Workers Facing Problem With Real Estate Boom - Sakshi

సాక్షి, హుస్నాబాద్‌: పట్టణాలు పెద్ద ఎత్తున విస్తరిస్తుండటంతో రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పట్టణాల శివారుల్లోని బీడు భూములకు అధిక ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు తాటి వనాలు ఉన్న భూములను కొనుగోలు చేయడంతో ఆయా గ్రామాల ‘కల్లు గీత’ కార్మికుల పై రియల్‌ కత్తి వేటు పడుతోంది. కొనుగోలు చేసిన వ్యాపారులు తాటి చెట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేయడంతో కల్లు గీత కార్మికులు ప్రతిఘటిస్తున్నారు.

పగటిపూట చెట్లను నరికితే అడ్డొస్తున్నారని రాత్రి వేళల్లో అధునాతన మిషన్లతో పది నిమిషాల్లో కల్లు పారే ఒక్కో చెట్టును నేల కూల్చుతున్నారు. దీంతో వందల మంది గీత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దీంతో రియల్‌ వ్యాపారులు చుట్టు పక్కల గ్రామాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నారు. పట్టణ శివారు గ్రామాలైన పందిల్ల , తోటపల్లి తాటి వనంలో వేల సంఖ్యలో తాటి చెట్లు ఉండటంతో ఇక్కడ వందలాది గీత కార్మిక కుటుంబాలు కల్లు గీతపై జీవనం సాగిస్తున్నాయి. ఒక్కొక్క కార్మికుడు సీజన్‌లో రోజుకు వేయి రూపాలయల కల్లు విక్రయిస్తుంటారు.  ఇతర గ్రామాల నుంచి కూడ ఇక్కడకి కల్లు గీయడానికి వస్తుంటారు.  హుస్నాబాద్, సిద్దపేట కేంద్రం రోడ్డులో ఉన్న తాటి వనంపై రియల్‌ వ్యాపారుల కన్ను పడింది.  ఆ భూములను కొనుగోలు చేసిన వారు సాగు పేరు చెప్పి తాటి చెట్లను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికారులకు ముడుపులు..
ఏ రైతు భూమిలో తాటి చెట్లు ఉన్నా.. వాటికి కల్లు గీసే హక్కు గీతా కార్మికులకు ఉంటుంది. తాటి చెట్టు కల్లు గీసినందుకు చెట్టుకు సొసైటీల ద్వారా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కల్లు పారే చెట్లను నరికేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతులు ఇవ్వకూడదు. ఒక వేల భూ యాజమాని చెట్లను కొట్టాలని ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టినా అనుమతి ఇచ్చే ముందు ఎక్సైయిజ్‌ అధికారుల నుంచి కల్లు పారుతుందా..? లేదా..? అనే విషయం తెలుసుకుంటారు. సంబంధిత అధికారులు భూ యాజమానులు ఇచ్చిన ముడపులకు ఆశపడి అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. పందిల్ల తాటి వనంలో 32 రెండు చెట్లను తొలగించుటకు అధికారులు అనుమతులు ఇవ్వడంతో రాత్రి రాత్రికే మిషన్లు తెచ్చి తొలగించి కార్మికుల పొట్ట కొట్టారు. 

చెట్టుకు పరిహారం ....
గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లు కూలిపోతే వాటికి ఎక్సైయిజ్‌శాఖ నుంచి పరిహారంను గీతా కార్మిక సొసైటీలకు అందిస్తారు. ఒక్కొక్క చెట్టుకు రూ.1,960లు చెల్లించగా ఇందులో 50శాతం భూ యాజమానికి, 50శాతం గీతా కార్మిక సొసైటీకి అందించడం జరుగుతుంది. అయితే ఇది ప్రకృతి వైపర్యాల వల్ల కూలిపోయిన చెట్లకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉంది. అధికారులు మాత్రం యాజమానులకు చెట్లు నరికేందుకు అడ్డదారిలో అనుమతులు ఇచ్చి పరిహారం ఇస్తామని కార్మికులను బుజ్జగిస్తున్నారు. రోజుకు రూ.500 కల్లు అమ్ముకునే కార్మికునికి రూ.930లు ఇస్తే ఏట్లా సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా అనుమతులు ఇవ్వడంతో భూ యాజమానులకు ఇచ్చే పరిహారంను కూడ అధికారులు కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

హరితహారం మాటే లేదు.....
ప్రభుత్వం గీతా కార్మికులకు ఉపాధి కల్పించుటకు హరితహారంలో తాటి, ఈత, ఖర్జుర చెట్లను పెంచాలని ఎక్సైయిజ్‌ అధికారులచేత మొక్కలు నాటించి వాటిని సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. హుస్నాబాద్‌ ఎక్సైయిజ్‌ అధికారులు మాత్రం ఆ మొక్కలు పెంచడం పక్కన పెట్టి కల్లు పారే తాటి చెట్ల నరికివేసేందుకు అడ్డదారుల్లో అనుమతులు ఇస్తున్నారని బాధిత గీతా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు హరిత హారంలో మొక్కలు నాటిన ఎక్సైయిజ్‌ అధికారులు వాటిని రక్షించుటకు ఎప్పుడు చర్యలు తీసుకోనే లేదు. ప్రతి ఏటా హారితహారం మొక్కలు నాటడం వాటిని వదిలేయడం.

పరిహారం పెంచాలి
తాటి చెట్టును నమ్ముకొని బతికే కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మా పందిల్ల గ్రామంలోనే 86 కుటుంబాలు ఈ వృత్తి మీదనే ఆధారపడి ఉన్నాయి. పొరుగు గ్రామాల కార్మికులు సైతం వచ్చి కల్లు గీతా వృత్తిలో జీవిస్తున్నారు. రాత్రి వేళలో వచ్చిన చెట్లను నరకడం వల్ల కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒక్కొక్క చెట్టుకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి. మల్లన్నసాగర్‌లో తాటి చెట్లు పోయిన కార్మికులకు ఇచ్చినట్లు మా గ్రామ గీత కార్మికులకు కూడా ఇవ్వాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాటి వనాలు నరికేస్తున్నారు. ఒకరిపై కేసులు నమోదు చేస్తే మరెప్పుడు తాటి చెట్లను నరికేందుకు భయపడుతారు.  
–తోడేటి రమేశ్, సర్పంచ్‌ పందిల్ల 

Advertisement
Advertisement