విలువలేని ఓటు.. నోటా! | Sakshi
Sakshi News home page

విలువలేని ఓటు.. నోటా!

Published Wed, May 21 2014 4:24 AM

విలువలేని ఓటు.. నోటా! - Sakshi

  •      ప్రకటించిన ఎన్నికల సంఘం
  •      చర్చనీయాంశంగా మారిన నిర్ణయం
  •  సాక్షి, సిటీబ్యూరో: ‘నోటా’... గత సార్వత్రిక ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓటర్లకు అందివచ్చిన అవకాశం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరూ తమకు నచ్చనట్లయితే.. పైవారిలో ఎవరూ కాదు (నోటా) అని ఓటేసే అవకాశాన్ని ఇస్తూ ఈవీఎంలో అభ్యర్థుల గుర్తులన్నింటికన్నా చివరి బటన్‌ను ఇందుకు కేటాయించారు. ఈ విషయం ఓటర్లకు తెలుసు. అభ్యర్థులెవరూ న చ్చనట్లయితే.. నోటా బటన్‌ను నొక్కారు.

    అర్హులైన అభ్యర్థులెవరూ లేరనే విషయాన్ని తెలియజేసేందుకు నోటాను నొక్కి పలువురు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. తాము వేసే ఓటులో ‘నోటా’ను కూడా పరిగణిస్తారని పలువురు ఓటర్లు భావించారు. ఓటర్లే కాదు పలు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సైతం నోటాను కూడా విలువైన ఓటుగానే భావించి .. అందుకనుగుణంగా ఎన్నికల సంఘానికి పంపిన పోలైన ఓట్ల జాబితాలో తెలిపారు. అయితే ‘నోటా’ విలువైన ఓటు కాదని.. ఆ వివరాలను విడిగా పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారికి, రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందింది.

    దీంతో అప్పటి వరకూ నోటాను కూడా విలువైన ఓటుగా భావించిన రిటర్నింగ్ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అదీ ‘ఓటు’హక్కుగానే భావించిన పలువురు ఓటర్లకు ఇంకా ఆ విషయం తెలియదు. తాజాగా ఆ విషయం తెలుసుకున్న కొందరు ఓటర్లు తాము వేసిన ఆ ఓటుకు విలువే లేకపోతే పోలింగ్ స్టేషన్ల దాకా వెళ్లి.. వరుసలో నిల్చొని.. ఓటు వేయడం వృథాయే కదా అని  వాపోతున్నారు.

    ఎన్నికలకు ముందు ‘నోటా’ కూడా విలువైన ఓటుగానే ప్రచారం చేశారు. దాంతో పోటీలోని నాయకులెవరూ నచ్చకపోయినా పలువురు ఓటు వేశారు. ఆ ఓటుకు విలువే లేనప్పుడు నోటా ఉండీ ప్రయోజనమేమిటనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నోటా తీవ్ర చర్చనీయాంశమైంది.
     

Advertisement
Advertisement