ఢీసీసీబీ | Sakshi
Sakshi News home page

ఢీసీసీబీ

Published Thu, Jun 26 2014 1:40 AM

ఢీసీసీబీ - Sakshi

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : సహకార చట్టాన్ని అపహాస్యం చేస్తూ.. దొడ్డిదోవన పదవి కట్టబెట్టిన అప్పటి కాంగ్రెస్ మంత్రులు చేసిన నిర్ణయానికి కాలం చెల్లింది. ఆరునెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి బుధవారం తిరిగి విధుల్లో చేరారు. అదీ ఇన్‌చార్జ్ చైర్మన్‌గా పాండురంగారావు స్థాని కంగా లేని సమయంలో. దీంతో సహకార ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాలు చిత్తుకాగితాలే అయ్యాయి. విజయేందర్‌రెడ్డిపై ఒత్తిడి పెట్టి మరీ పంతంనెగ్గించుకున్న అప్పటి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ఇప్పుడేం చేస్తారు..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు చూస్తూ ఊరుకుంటారా...? అన్న విషయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గత విషయాలను ఓసారి మననం చేసుకుంటే.., జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆరునెలలు సెలవు పెట్టారు.
 
 అప్పటి  జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పెట్టిన ఒత్తిడి వల్లే చైర్మన్ సెలవులో వెళ్లారన్న ప్రచారం కాంగ్రెస్‌లో జోరుగా సాగింది. రాజకీయ సమీకరణలో భాగంగా బ్యాంకు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు చైర్మన్ బాధ్యతలను అప్పగించాలనే ఉద్దేశంతో విజయేందర్‌రెడ్డిని సెలవుపెట్టించారన్న వార్తలూ గుప్పుమన్నాయి. ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి అప్పటి మంత్రుల హోదాలో  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇద్దరూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన విజయేం దర్‌రెడ్డికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కూడా ఆలేఖలో విన్నవించారు.
 
 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఇక, పదవీత్యాగం చేసిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశం ఎక్కడిది. దీంతో అధికారికంగా ఉన్న తన పదవిని ఎందుకు వదిలేసుకోవాలనుకున్నారేమో కానీ, విజయేందర్‌రెడ్డి ఈనెలాఖారు దాకా సెలువు ఉన్నా, బుధవారం తిరిగి చైర్మన్‌గా విధుల్లో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓ కులం ఓట్ల కోసమే ఇదంతా జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. విజయేందర్‌రెడ్డి ఇప్పుడు ఒకరకంగా అడ్డం తిరిగినట్లే. ఏరికోరి తన అనుచరుడి కోసం ఉత్తమ్ చేసిన ప్రయత్నాలు నిష్ఫలమైనట్లే కనిపిస్తున్నాయి.
 
 అవిశ్వాస తీర్మానంతో దించివేయడం మినహా విజయేందర్‌రెడ్డి జోలికి ఎవరూ వచ్చే పరిస్థితి కనిపించడం  లేదు. అదీ రెండున్నరేళ్ల తర్వాతే అవిశ్వాసానికి ఆస్కారం ఉంటుంది. కానీ, ఇవేవీ జరగకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. జానారెడ్డితో ముందస్తుగా మాట్లాడి, భరోసాతోనే  విజయేందర్‌రెడ్డి విధుల్లో చేరారని, ఇదంతా ముఖ్య నాయకులకు తెలిసే జరిగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. కాగా, వైస్‌చైర్మన్ పాండురంగారావుకు చైర్మన్ పదవి ‘మూన్నాళ్ల ముచ్చట’గానే మిగిలిపోయింది.  ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి చిచ్చు రగిలిస్తుందో వేచి చూడాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement