అందరి ఆత్మబంధువు వైఎస్సార్ | Sakshi
Sakshi News home page

అందరి ఆత్మబంధువు వైఎస్సార్

Published Wed, Jun 10 2015 1:24 AM

అందరి ఆత్మబంధువు వైఎస్సార్

నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల
ప్రజలందరినీ ఆయన కన్నబిడ్డల్లా చూసుకున్నారు
పేదల కోసం ఎన్నో అద్భుత పథకాలను అమలు చేశారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి మరణిస్తే.. దానిని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు వదిలారు. దేశచరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా, ఎవరి విషయంలో జరగనిది ఒక్క వైఎస్సార్ విషయంలో జరిగింది. అందుకు కారణం ఒక్కటే. కోట్ల మంది తెలుగు ప్రజలకు వైఎస్సార్ ఆత్మబంధువు అయ్యారు.

ప్రజల హృదయాల్లో ప్రజల మనిషిగా నిలిచిపోయారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శిస్తానన్న జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు ఆయన తరఫున షర్మిల తెలంగాణలో పరామర్శయాత్ర చేపట్టారు.

అందులో భాగంగా మంగళవారం నుంచి నల్లగొండ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర ప్రారంభించిన షర్మిల... వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి, వారి కష్టసుఖాలను, స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండలం పులిగిళ్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోయినా పేదల పక్షాన పోరాడారని.. వారి బాగుకోసం కృషి చేశారని చెప్పారు.

పేదలకు ఎంత చేసినా, ఏం చేసినా తక్కువేనన్న ఆలోచనతో పనిచేశారని, ఎన్నో అద్భుత పథకాలను అమలుచేశారని పేర్కొన్నారు. ఆయన మరణించి ఇన్నేళ్లవుతున్నా ప్రజలు తలచుకుంటూనే ఉన్నారని చెప్పారు. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఉచిత విద్యుత్, మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లక్షలాది మంది చదువుకుని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని.. ‘ఆరోగ్యశ్రీ’తో పేదలు కూడా తలెత్తుకుని కార్పొరేట్ వైద్యం చేయించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.

ఫోన్ చేసిన నిమిషాల్లోనే చేరుకుని వైద్య సహాయం అందిస్తూ 108 వాహనాలు లక్షలాది మందికి పునర్జన్మను ఇచ్చాయని షర్మిల వెల్లడించారు. ఇలా వైఎస్సార్ ఏ ఆలోచన చేసినా పేదల గురించేనని, పేదలను గుండెల్లో పెట్టుకుని పాలించారని చెప్పారు. ‘‘వైఎస్సార్ రాజన్న అయ్యాడు. కోట్ల మంది తెలుగు ప్రజలకు ఆత్మబంధువు అయ్యాడు. మా కుటుంబంపై మీరు చూపుతున్న అభిమానానికి మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నా..’’ అని షర్మిల పేర్కొన్నారు.
 
వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి..
నల్లగొండ జిల్లా మలివిడత పరామర్శయాత్రలో భాగంగా షర్మిల తొలిరోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శించారు. బీబీనగర్ మండల కేంద్రానికి సమీపంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. తొలుత వెంకిర్యాల గ్రామంలో చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. తర్వాత వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, అనంతరం భువనగిరి మండలం ముస్త్యాలపల్లిలో కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

తర్వాత ఆలేరు నియోజకవర్గం దాతరుపల్లిలో సుంచు చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఇక బుధవారం రెండోరోజు యాత్ర ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ యాత్రలో షర్మిల వెంట ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు వడ్లోజు వెంకటేశం.

ఏనుగు మహిపాల్‌రెడ్డి, అమృతాసాగర్, రాంభూపాల్‌రెడ్డి, బి.శ్రీనివాస్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, విలియం మునగాల, ఎం.భగవంత్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, అక్కినపల్లి కుమార్, బి.రఘురామరెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, కుమార్‌యాదవ్, సామ యాదిరెడ్డి, జి.వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పార్టీ అధ్యక్షులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బి.అనిల్ కుమార్, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జి.సురేశ్‌రెడ్డి, జె.మహేందర్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నేతలు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement