జమీన్ బందీ.. నో రందీ | Sakshi
Sakshi News home page

జమీన్ బందీ.. నో రందీ

Published Sat, Feb 28 2015 12:42 AM

జమీన్ బందీ.. నో రందీ - Sakshi

భూ వివాదాలను సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జమీన్ బందీ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. పలు మండలాల్లో ఈ పథకాన్ని తొలిదశ అమలును పూర్తి చేశారు. అక్కడి సమస్యలను సత్వరం పరిష్కరించడమే గాక అవసరమైన సర్టిఫికెట్లు అందజేసి పూర్తి హక్కులు కల్పించారు. ఏళ్లతరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా.. కోర్టు ఫీజు, ఇతరత్రా వ్యవహారాలకు డబ్బు ఖర్చు చేసుకున్నా ఫలితం కన్పించ లేదని.. 

జమీన్ బందీతో రందీ బోయిందని  రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 
భూ సమస్యలు సత్వర పరిష్కారం
పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తూ సర్టిఫికెట్లు జారీ
సమయంతోపాటు డబ్బు ఆదా
రైతులు, పేదల ముఖాల్లో వెలుగులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూ వివాదాలకు జిల్లాలో యేటా సగటున రూ.4.50 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇందులో పోలీసు, కోర్టు కేసుల కోసం రూ.3 కోట్లు, రెవెన్యూ పరిష్కారం కేసుల కోసం మరో రూ.1.50 కోట్లు జనం ఖర్చు పెడుతున్నారు. వివాదాస్పద భూముల సాగు, అభివృద్ధి లేక బీడు బడటంతో దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఉత్పత్తి ఆగిపోతుందని అంచనా. భూవివాదాల కోసం ఏడాదికి కనీసం 50 వేల మంది యువకులు పని చేసే సామర్థ్యం వృథాగా పోతోంది. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం జమీన్ బందీ పథకానికి రూపకల్పన చేసింది.

జిల్లాలో మొత్తం 9.50 లక్షల హెక్టార్లలో భూమి ఉంది. అందులో 6.50 లక్ష ల హెక్టార్లు వ్యవసాయానికి, 9 వేల హెక్టార్ల లో ఫారెస్టు భూములు, 1.5 లక్షల హెక్టార్లు అభివృద్ధి అవసరమైన భూములు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల ఎకరాలపై రెవెన్యూ వివాదాలు ఉన్నాయి. పట్టా మార్పిడి, విరాసత్, షివాయ్ జమెదార్, ఫౌతి అనుభవదారు ల పేర్లలో తప్పుల సవరణ, ఇనాం భూముల పట్టాలు, సాదా బైనామాలు తదితర రెవెన్యూ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇలా దాదాపు వేలాది మంది ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరి ష్కారం దొరకడం లేదు. రెవెన్యూ సదస్సులు, గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వివాదాలను క్షేత్ర స్థాయిలో పరిశీ లించి.. పరిష్కరించడం కోసం ప్రభుత్వం జమీన్ బందీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
 
29 మండలాల్లో తొలి దశ పూర్తి..
జమీన్ బందీ పథకం 29 మండలాల్లో ప్రాథమిక దశ పూర్తి అయింది.దాదాపు 18 వేల మంది భూ వివాదాల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 17 మండలాలు మిగిలి ఉన్నాయి. ఈ మండలాల్లో మరో 10 వేలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులకు మార్చి 31 లోగా పరిష్కారం చూపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా..
ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 600 మంది రైతులకు వివాదాలను పరిష్కరించి, పక్కా సర్టిఫికెట్లు అందజేశారు. దీనిపై రైతుల నుంచి మంచి స్పందన రావడంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
 
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జేసీ..
జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రోజూ అకస్మిక పర్యటనలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 29 మండలాల్లో 600 గ్రామాల్లో జమీన్ బందీ శిబిరాలు నిర్వహించారు. భూ పంపిణీ పథకం కింద దళితులకు భూములిచ్చి ఇప్పటివరకు పొజిషన్ చూపించని వారిని గుర్తించి వారికి భూమి కేటాయిస్తున్నారు. పహాణీ, 1-బీ సర్టిఫికెట్, నక్ష, భూ యాజమాన్య పట్టా, పట్టాదారు హక్కు పుస్తకం తదితర ఏడు రికార్డుల విధానాన్ని అమలు చేసి దళి తుల భూములకు పక్కా రక్షణ కల్పిస్తున్నారు. గతంలో రెవెన్యూ సదస్సుల ద్వారా కేవలం 16,800 దరఖాస్తులు మాత్రమే రాగా, ఈ పథకం కింద ఇప్పటికే 18 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని జేసీ శరత్ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement