హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు

Published Sun, Jul 27 2014 2:50 AM

హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు - Sakshi

అ‘ద్వితీయ'ంగా జూపార్క్
ప్రస్తుతం ఉన్న మినీ జూ అప్‌గ్రేడ్
ఆదేశాలు జారీచేసిన అటవీ శాఖ మంత్రి
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
సాక్షి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రెండో జూ పార్కు ఏర్పాటు కానుంది. ఇందుకు వరంగల్ వేదికగా నిలవనుంది. హంటర్‌రోడ్డులోని మినీ జూను అప్‌గ్రేడ్ చేయూలని... హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు తరహాలో అభివృద్ధి చేయూలని రాష్ట్ర అటవీ శాఖమంత్రి జోగు రామన్న ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ పార్కుకు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ఒక్క హైదరాబాద్‌లోనే జూ పార్కు ఉండగా... సీమాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం, తిరుపతిలో రెండు జూ పార్కులు ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఈ ప్రాంతంలోని వరంగల్, మహ బూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో వనవిజ్ఞాన కేంద్రాలను మినీ జూలుగా అప్‌గ్రేడ్ చేయాలని 2012 మే నెలలో ఉన్నతాధికారులకు ఆయా జిల్లాల అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఏడాదిన్నర పాటు ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. చివరకు వరంగల్ వనవిజ్ఞాన కేంద్రాన్ని మాత్రమే మినీ జూగా అప్‌గ్రేడ్ చేస్తూ 2013 డిసెంబర్‌లో రాష్ట్ర అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకనుగుణంగా మినీ జూ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్కుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుండడంతో పర్యాటక పరంగా వరంగల్‌కు మహర్దశ పట్టనుంది.
 
ఆకట్టుకునేలా హంగులు
వనవిజ్ఞాన కేంద్రం ప్రస్తుతం 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో దుప్పులు, సాంబర్ జింక, ఎలుగుబంట్లకు ప్రత్యేకంగా పార్కులు ఉండగా... కొండగొర్రెలు, ఎలుగుబంటి, నెమళ్లు, రామచిలకలు, పావురాలు, నిప్పుకోళ్లకు మాత్రమే ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. మినీ జూ పార్క్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొసళ్లు, నక్షత్ర తాబేళ్లు, సాలీడు, నిప్పు కోళ్లు, చౌసింగా, నక్కలు వంటి కొత్త జీవులు జూలోకి వచ్చి చేరాయి. వీటితోపాటు హంసలు, కృష్ణజింక, నీల్‌గాయ్‌లకు సంబంధించిన ఎన్‌క్లోజర్ల నిర్మాణం పూర్తయింది.

మరికొద్ది రోజుల్లో ఈ జంతువులు సైతం ఇక్కడకు రానున్నాయి. అంతేకాకుండా... సందర్శకులకు కనువిందు చేసేలా ఇందులో బటర్‌ఫ్లై పార్కు రూపుదిద్దుకుంది. సందర్శకులకు మౌలిక వసతుల కల్పనతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అంతర్గత రోడ్ల నిర్మాణం, కేఫ్‌టేరియా, మూత్రశాలలు, పగోడాలు, వంతెనలను నిర్మించారు. గార్డెన్,  పిల్లల పార్కులకు మరిన్ని హంగులు అద్దారు.
 
స్థల సేకరణకు ప్రణాళికలు
వరంగల్ మినీ జూ పార్కును  అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జూ పార్క్‌గా అప్‌గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో అధిక మొత్తంలో నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపులి, తెల్లపులి, చిరుత, తోడేలు, ఏనుగు, పగ్‌డీర్, బార్కింగ్‌డీర్, హైనా, అడవిపంది తదితర జంతువులకు సంబంధించిన ఎన్‌క్లోజర్లను నిర్మించేందుకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే నిధులను బట్టి ఈ ఎన్‌క్లోజర్లను నిర్మించనున్నారు.

ఆ తర్వాత దశల వారీగా వివిధ జంతువులను జూ పార్కుకు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. జూను సందర్శించే వారికి వినోదాన్ని అందించడమే కాకుండా విజ్ఞానాన్ని పంచేందుకు ప్రతి ఎన్‌క్లోజర్ వద్ద ఆయూ జంతువులు, పక్షులకు సంబంధించిన సమస్త సమాచారంతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఇక.. జూగా అప్‌గ్రేడ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం వనవిజ్ఞాన కేంద్రానికి అనుకుని చుట్టుపక్కల అందుబాటులో ఉన్న స్థలాన్ని సేకరించేందుకు అధికారులు ముందస్తుగా  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement