జెడ్పీ ప్రణాళిక.. రూ.1000కోట్లు | Sakshi
Sakshi News home page

జెడ్పీ ప్రణాళిక.. రూ.1000కోట్లు

Published Mon, Aug 18 2014 2:41 AM

జెడ్పీ ప్రణాళిక..  రూ.1000కోట్లు

 నీలగిరి : పల్లె ప్రణాళిక తరహాలోనే...జిల్లా పరిషత్ ప్రణాళికలు తయారయ్యాయి. జెడ్పీ ఆమోదించిన రూ.15 వేల కోట్ల జిల్లా ప్రణాళికలోనుంచి 30 ప్రాధాన్యత అంశాలను తొలి ఏడాదిలో చేపట్టేందుకు రూ.వెయ్యి కోట్ల ప్రణాళికతో అధికారులు సమాయత్తమయ్యారు. జిల్లా సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కీలకశాఖలకు ప్రాధాన్యం కల్పించారు. విద్య, వైద్యం, క్రీడలు, యువత ఉపాధి, పర్యాటకం, రహదారుల నిర్మాణాలకు పెద్దపీట వేశారు. ‘మన జిల్లా-మన ప్రణాళిక’లో భాగంగా 30 ప్రాధాన్యత పనులు గుర్తించిన అధికారులు అందుకు అవసరమయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. దీంట్లో సింహభాగం గ్రామీణ తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు.  
 
   వసతి గృహాలు, కేజీబీవీల సమస్యల పరిష్కారం
 జిల్లాలో సంక్షేమ వసతి గృహాల ఆధునికీకరణ, హాస్టల్ విద్యార్థులకు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. అదే విధంగా కోట్ల రూపాచలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు ప్రహరీ లేవు. దీని వల్ల బాలికలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్‌లో ఈ పాఠశాలల్లో ఆర్వోప్లాంట్లు (రివర్స్ ఆర్మోసిస్ ప్లాంట్లు) ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. దీంతో ముందస్తుగా ఆయా పాఠశాలలకు ప్రహరీలు, హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రణాళికలో రూ.60 కోట్లు కేటాయించారు.
 
   స్త్రీ శక్తి భవనాలకు మోక్షం
  జిల్లాలో స్త్రీ శక్తి భవనాలు నిధులు లేక పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాలకు నిధులు కేటాయించి పనులు చేపట్టడం ద్వారా నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ భవనాల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు.
 
   పర్యాటకం పురోగతి
 తెలంగాణ రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న నల్లగొండ జిల్లాకు పర్యాటక శోభ తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. డిండి, ఉండ్రుగొండ, నీలగిరి శిల్పారామం, పోచంపల్లిలో గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని నిర్మించేందుకు రూ.4 కోట్లు కే టాయించారు.
 
   యువతకు ఉపాధి
 నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలో రూ.33 కోట్లు కేటాయించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు యువతీ, యువకుల అర్హతను బట్టి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది.
 
   భూసార పరీక్ష కేంద్రాలు
 రైతుల్లో అవగాహన కల్పించి పంట మార్పిడి చర్యలు చేపట్టేందుకు డివిజన్ కేంద్రాల్లో భూసార పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రణాళికలో రూ.3కోట్లు కేటాయించారు. డివిజన్ కేం ద్రాల్లో భూసార పరీక్ష సహాయ సంచాలకుల కార్యాల యాల నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించారు.
 
   రహదారుల విస్తరణ
 జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల విస్తరించేందు రూ.158 కోట్ల ప్రణాళిక తయారు చేశారు. మండల కేంద్రాల రహదారులను ప్రధాన రహదారులకు అను సంధానం చేసేందుకుగాను ఈ నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 77 రోడ్ల నిర్మాణాలకు రూ.125 కోట్లు కేటాయించారు. మండలాలు, గ్రామాల రహదారులను అనుసంధానం చేసేందుకు పంచాయతీరాజ్ ప్రణాళిక రూపొందించింది.
 
   విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు...
 గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశారు. ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖకు ప్రత్యేక బడ్జెట్ లేకపోవడం వల్ల చర్యలు చేపట్టడంలో అధికారులు మిన్నకుండిపోయారు. గ్రామాల్లో ఇళ్ల మీద నుంచి వెళ్లే హైటెన్షన్ లైన్లను తొలగించేందుకు, వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి, వేలాడుతున్న తీగలను తొలగించి అక్కడ మధ్యంతర విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చే సేందుకు రూ.20 కోట్ల ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల గ్రామాల్లో విద్యుత్ చౌర్యం నియంత్రణ, ప్రమాదాలు నివారణకు దోహద పడుతుంది.
 

Advertisement
Advertisement