సౌదీలో చిక్కి.. చాటుకు నక్కి | Sakshi
Sakshi News home page

సౌదీలో చిక్కి.. చాటుకు నక్కి

Published Fri, Mar 2 2018 8:25 AM

సౌదీలో చిక్కి.. చాటుకు నక్కి - Sakshi

జన్నారం:  తెలియని దేశంలో చేయని తప్పుకు శిక్షలు అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేక.. ఉండడానికి నీడ లేక ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు. ఏదో సంపాదిస్తామనే ఆశతో వెళ్లిన వారికి నిరాశే మిగిలింది. ఇక్కడే ఉండి కలో గంజో తాగే బదులు దూరదేశాలకు భ్రమలకు గురై వెళ్తూ నానా తంటాలు పడుతున్నారు. మా గోస చూడండి మమ్మల్ని దేశానికి వచ్చేలా చూడంటంటూ వాట్సప్‌ల్లో సందేశాలు పెడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటిౖకైనా ప్రభుత్వం స్పందించి వారిని స్వదేశానికి వచ్చేందుకు చర్యలు చేపట్టాలని బాధితులు, కుటుంబీకులు కోరుతున్నారు. 

    ‘అన్నా.... ఆరు నెలల సంది కంపెనీ అకామా ఇవ్వక పనిలోకి తీసుకుంటలేదు. ఇంటికి పంపుతలేదు. ఆరు నెలల సంది చాలా ఇబ్బందిలో ఉన్నాం. తిండికి ఉండేందుకు గోస అయితంది. బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి మాది. బయటకు పోతే పోలీసోల్లు పట్టుకుని జైళ్లవేస్తరని భయమవుతోంది. మా బాధలు పట్టించుకోండ్రి, సర్కారు దృష్టికి తీసుకెళ్లి మమ్ములను ఇంటికి చేర్చండి అన్నా’ అని  సిరిసిల్ల జిల్లా వర్దనపెల్లికి చెందిన బోర్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి  తమ వాట్సప్‌ ద్వారా గల్ఫ్‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌ బాధ్యులను వేడుకుంటున్నారు.  

ఇలా సౌదీలో గత ఆరు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్న 14 మంది కార్మికులు వాట్సప్‌ ద్వారా తమ బాధలను పంపారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ముగ్గురు, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 14 మంది కార్మికులు ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. అక్కడ ఆల్‌కుదిరి కంపెనీలో కార్మికులుగా చేరారు. ఇదివరకు రెండు మార్లు అకామ వచ్చింది. మూడోసారి అకామా ఇవ్వలేదు. జీతాలు కూడా కంపెనీ సరిగ్గా ఇవ్వలేదు. దీంతో తాము ఇంటికి వెళ్తాము అని రాజీనామా పత్రాలను కంపెనీకి ఇచ్చారు.

కంపెనీ వారిని తమ ఇళ్లకు పంపాలని కోరారు. కాని కంపెనీ ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వారికి పాస్‌పోర్టులు ఇచ్చి పంపించింది. జీతాలు ఇవ్వకపోవడంతో చేతిలో డబ్బులు లేవు.  అకామ లేకుండా బయటకు వెళితే పోలీసులు జైళ్లో వేస్తారు. పని లేదు, ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేవు. తినేందుకు తిండి లేదు. ఉండేందుకు స్థలం లేదు. అక్కడ, ఇక్కడ అడుక్కుని తింటున్నారు. నాన్న చిత్రవధ అనుభవిస్తున్నాం. మా కుటుంబీకులు విషయం తెలిసిన నుంచి ఏడుస్తున్నారు. చాలా బాధనిపిస్తుంది. అని కార్మికులు తమ బాధలను వెళ్లగక్కారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తమను స్వగ్రామాలకు చేర్చాలని కోరుతున్నారు. 

చిక్కుకుంది వీరే.. 
ఉపాధి కోసం సౌదీ వెళ్లి అక్కడి కంపెనీలు పట్టింపు లేకుండా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 14 మంది అక్కడే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కాసారం జైరాం( నిర్మల్‌ జిల్లా), నర్సింహుల పోశయ్య(మెదక్‌), మలేస్‌ చంద్రయ్య(మెదక్‌), బోర్ల శ్రీనివాస్‌(సిరిసిల్ల), కాసల రవి(కామారెడ్డి), బట్టనల్ల గణేశ్‌(నిజామాబద్‌), దుమల్ల గంగయ్య(కామారెడ్డి), సర్ల సాయిలు(కరీంనగర్‌), కొంబర్తుల అర్జయ్య(పశ్చిమగోదావరి), షేక్‌ రఫీ(జన్నారం, మంచిర్యాల జిల్లా), చిట్యాల రమేశ్‌( నిర్మల్‌), రాజేశంగౌడ్‌(జగిత్యాల), మాధవరావు(తూర్పు గోదావరి), మల్లేశం(కోరుట్ల) ఉన్నారు. 

తిండికి గోసైతంది
మూడు నెలల నుంచి పని లేదు. పైసలు లేవు. తిండికి గోసైతంది. నీళ్లు కొనాల్సి వస్తోంది.  చాలా బాధ అనిపిస్తుంది. గోస పడుతున్నం. ఉండటం, తినడానికి తిప్పలు పడుతున్నాం. మా బాధలను తెలుసుకుని మా కుటుంబీకులు ఏడుస్తున్నారు. చాలా బాధనిపిస్తుంది. మమ్ములను ఇంటికి చేర్చండి. 
కాసారం జైరాం, 
గులిమడ, నిర్మల్‌ జిల్లా


ప్రభుత్వం పట్టించుకోవాలి
సౌదీలో అకామ లేక నానా ఇబ్బందులు పడుతూ నాకు వీడియోలు పంపారు. ఈ వీడియోలను సంబంధిత అధికారులకు పంపాను. ఉపాధి లేక అప్పులు చేసి బయట దేశాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మానసికంగా కుంగిపోయి మృతి చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి. వారిని పట్టించుకుని స్వగ్రామాలకు తీసుకురావాలి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాను.
– పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్‌వెల్ఫేర్‌ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement
Advertisement