తెలంగాణ: ఉప్పొంగిన ముసలమ్మ వాగు | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 20 2018 1:01 PM

​heavy rains in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి.  గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 43.4 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి నది ఉధృతి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు సబ్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్  ఫోన్‌ నంబర్‌ (08743-232444) ఏర్పాటు చేశారు.

ఉప్పొంగిన ముసలమ్మ వాగు
భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలంలో వాగుకు గండి పడి సర్వాయి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అత్యవసర సేవల కోసం పోలీస్ శాఖ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. మంగపేట మండలం కమలాపురం రమణక్కపేట వద్ద ముసలమ్మ వాగు ఉప్పొంగి ప్రధాన రహదారి ధ్వంసమైంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు పెట్టారు. ఏటూరునాగారం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్ళల్లోకి చేరిన వర్షపు నీరు. డ్రైనేజీ లోపమేనని అంటున్న గ్రామస్థులు. రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఖమ్మం జిల్లాలోనూ..
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద కల్లూరు వాగు ప్రదాన రహారి బ్రిడ్జిని ఆనుకుని నీరు ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఓపెన్‌ కాస్ట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఓపెన్‌ కాస్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాలుగు ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రోజుకి 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై భారీ యంత్రాలను పైకి తీసుకువచ్చారు. ఇక, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, చెరువులు, కుంటలు నిండిపోయాయి.వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరడంతో ఒక్క కోదాడ పట్టణంలోనే 100 ఇళ్లు నీటమునిగాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఆ నీరు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో ఇంట్లోని సామాన్లన్ని నీళ్లలో తడిసిపోయాయి.


ప్రాజెక్టులవారీగా వరద ఉధృతి వివరాలు..

  • భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత
  • ఇన్‌ఫ్లో 44 వేలు, ఔట్‌ఫ్లో 72వేల క్యూసెక్కులు
  • తాలిపేరు ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 72.30 మీటర్లు

శ్రీపాదకు కొనసాగుతున్న వరద

  • పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
  • ఇన్‌ఫ్లో 16924 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 32,340 క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 18.925 టీఎంసీలు
     
  • మంచిర్యాల: పొంగిపొర్లుతున్న సుద్దాల, గొర్లపల్లి వాగులు
  • చెన్నూర్, వేమనపల్లి మండలాల్లో 35 గ్రామాలకు రాకపోకలు బంద్

సాగర్ ప్రాజెక్ట్‌ ఔట్‌ఫ్లో 7వేల క్యూసెక్కులు

  • నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద
  • ప్రాజెక్ట్ సామర్ధ్యం 590, ప్రస్తుత నీటిమట్టం 542.70 అడుగులు
  • ఇన్‌ఫ్లో 2 లక్షల 8వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7వేల క్యూసెక్కులు
  • నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం
  • ఇన్‌ఫ్లో 950 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 60 క్యూసెక్కులు

భూపాలపల్లి జిల్లాల్లో

  • భూపాలపల్లి: మహదేవ్‌పూర్, పలిమెల, మల్హర్ మండలాల్లో భారీ వర్షం
  • ఉధృతంగా ప్రవహిస్తున్న దౌత్‌పల్లి, పంకేన, సర్వాయిపేట, తీగల వాగులు
  • గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు, నిలిచిన బొగ్గు ఉత్పత్తి

Advertisement
Advertisement