తీవ్ర ఒత్తిడిలో పోలీస్ | Sakshi
Sakshi News home page

తీవ్ర ఒత్తిడిలో పోలీస్

Published Fri, Jun 5 2015 2:17 AM

తీవ్ర ఒత్తిడిలో పోలీస్ - Sakshi

నిరంతర పనితో ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, ప్రవర్తనపై దుష్ర్పభావం
పోలీసులకు 8 గంటల షిఫ్ట్ విధానం తప్పనిసరి చేయాలి
కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
పోలీసుల పనితీరుపై ‘ఆస్కి’ అధ్యయన నివేదిక సిఫారసులు


సాక్షి, హైదరాబాద్: అందరికీ భద్రత కల్పించే పోలీసు తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నాడు. సెలవులు, షిఫ్టులు ఎరగని విధులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. పోలీసుల కాఠిన్యం, కరకుదనం, దుష్ర్పవర్తనలు వంటి వాటికి నిరంతర పని ఒత్తిడే ప్రధాన కారణమని ప్రఖ్యాత పరిపాలన శిక్షణ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. తీవ్ర పని ఒత్తిడితో పోలీసులు ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సైతం కోల్పోతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 23 రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 12,156 మంది పోలీసులను ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. పోలీసులు ఒక్కొక్కసారి ఏకంగా 24 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని.. సెలవును సైతం దాసోహం చేసి డ్యూటీకి హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని నివేదిక తేల్చింది. డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అత్యవసర పరిస్థితి ఎదురవతుండటంతో దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తిరిగి పిలిపించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇలా ఎక్కువ గంటలపాటు పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని.. పని ఒత్తిడి చీకాకుల్లో సామాన్యులపై నోరు పారేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని.. ఈ నేపథ్యంలో పోలీసులు రోజురోజుకూ సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారని వెల్లడించింది.

షిఫ్ట్ పద్ధతి పెడితే మేలు
పోలీసులో మార్పు తీసుకొచ్చేందుకు షిఫ్ట్ పద్ధతి పెడితే ఎలా ఉంటుందన్న దానిపై ఆస్కి చర్చించింది. ఇప్పటికే కేరళలో అమల్లో ఉన్న ఎనిమిది గంటల డ్యూటీ వ్యవస్థ విజయవంతమైనట్లుగా వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న  పోలీసు స్టేషన్‌లకు వెళ్లి చేసిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేటతెల్లమైందని తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement