ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ

Published Wed, Dec 4 2013 2:54 AM

ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది పరారయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి ఎనిమిది మందిని పట్టుకోగా... మరో ముగ్గురు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరికోసం వేట ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి 9.30-12.30 మధ్య జరిగిన ఈ ఘటన వివరాలివి... నాంపల్లిలోని ఛాపెల్ రోడ్ ఫాహుద్దీన్ ఖురేషీ (38)పై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాలు కలిగిన తదితర కేసులు నమోదై ఉన్నాయి.
 
 ఫలితంగా చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఇతడి మానసిక పరిస్థితి బాలేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖురేషీ రెండో భార్య అతడిని కలిసేందుకు రాగా ఆర్‌ఎంఓ ఓంప్రకాష్ అనుమతించలేదు. దీంతో ఖురేషీ దాదాపు రెండు గంటల పాటు ప్రిజనల్ వార్డులో హంగామా సృష్టించాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్‌షీట్‌లను తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీనివల్ల తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. ఈ హడావిడిలో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి ఖురేషీ మరో పదిమంది ఖైదీలతో పారిపోయాడు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మాజీ ఉద్యోగులు ప్రశ్నించగా కత్తితో బెదిరించాడు. దీంతో భయపడిన వారు 11మంది ఖైదీలు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రి అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
 
  మిగిలిన పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఖురేషీ టవేరా కారు (ఏపీ09 బిసి 7909)లో రెండో భార్యతో ముంబై పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారూ వీరితో పాటే ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఖైదీలు పారిపోవడం వెనుక ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం, నిర్లక్ష్యం ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురికీ ఘనమైన నేరచరిత్ర ఉందనీ, వారు సామాన్యులపై దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement