14 ఏళ్ల కుర్రాడు.. 5 కోట్ల కాంట్రాక్టు పట్టాడు! | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల కుర్రాడు.. 5 కోట్ల కాంట్రాక్టు పట్టాడు!

Published Fri, Jan 13 2017 2:55 PM

14 ఏళ్ల కుర్రాడు.. 5 కోట్ల కాంట్రాక్టు పట్టాడు! - Sakshi

వైబ్రెంట్ గుజరాత్ సదస్సు జరుగుతోంది.. అక్కడ అంతా దిగ్గజాలు కొలువుదీరారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 దేశాలు ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాయి. అలాంటి సదస్సులో సరిగ్గా 15 ఏళ్లు కూడా లేని ఓ చిన్న పిల్లాడు కళ్లజోడు పెట్టుకుని, నీలి రంగు సూట్ వేసుకుని వచ్చాడు. మాటలతో అక్కడున్నవారిని మంత్రముగ్ధులను చేశాడు. తాను డిజైన్ చేసిన డ్రోన్‌ను అక్కడివారికి చూపించాడు.. అంతే, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తమకు అలాంటి డ్రోన్ కావాలంటూ అతడితో 5 కోట్ల రూపాయలకు ఎంఓయూ కుదుర్చుకుంది. అతడెవరో కాదు.. హర్షవర్ధన్ జాలా. వయసు 14 సంవత్సరాలు. చదివేది పదో తరగతి. ఏరోబాటిక్స్ 7 టెక్ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యవస్థాపకుడు, సీఈఓ. గుజరాత్ ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాఖ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధ ప్రాంతాల్లోను, సరిహద్దుల్లోను మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడే డ్రోన్లను అతడు రూపొందించాడు. 
 
తన తోటి పిల్లలంతా పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే, అతడు మాత్రం తన వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలా అని ప్లాన్లు వేస్తూ ఇప్పటికే మూడు నమూనా డ్రోన్లు తయారు చేసేశాడు. గత సంవత్సరమే తాను ఈ తరహా డ్రోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టానని, టీవీ చూస్తున్నప్పుడు చాలామంది సైనికులు మందుపాతరలు పేలి మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం లాంటి ఘటనలు చూసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని అతడు చెప్పాడు. ఈ మూడు నమూనా డ్రోన్లు తయారుచేయడానికి అతడికి 5 లక్షలు కూడా పూర్తిగా ఖర్చవలేదు. కానీ 5 కోట్ల కాంట్రాక్టు పట్టేశాడు. ఈ డ్రోన్‌లో ఇన్‌ఫ్రారెడ్, ఆర్‌జీబీ సెన్సర్ ఉంటుందని, దాంతోపాటు థర్మల్ మీటర్, 21 మెగాపిక్సెళ్ల కెమెరా, మెకానికల్ షట్టర్ ఉంటాయని చెప్పాడు. వీటి సాయంతో ఇది హై రిజల్యూషన్ ఫొటోలు తీసి పంపుతుందని వివరించాడు. భూమికి 2 అడుగుల ఎత్తున ఎగురుతూ, 8 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఈ డ్రోన్ కవర్ చేస్తుంది. ఆ పరిధిలో ఎక్కడైనా మందుపాతరలను గుర్తిస్తే వెంటనే బేస్ స్టేషన్‌కు తెలియజేస్తుంది. ఇందులో 50 గ్రాముల బరువున్న బాంబు ఒకటి ఉంటుంది. అది మందుపాతరను ధ్వంసం చేస్తుంది. తన కంపెనీ ఏరోబాటిక్స్ పేరు మీద ఈ డ్రోన్‌కు ఇప్పటికే పేటెంట్ కూడా రిజిస్టర్ చేసేశాడు. 
 
హర్షవర్ధన్ తండ్రి ప్రద్యుమ్నసింగ్ జాలా నరోడాలోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో అకౌంటెంటుగా పనిచేస్తున్నారు. తల్లి నిషాబా జాలా గృహిణి. గతంలో అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అతడికి తన సొంత ఉత్పత్తికి పేటెంట్ పొందాలని కోరిక పుట్టింది. తన కంపెనీ భవిష్యత్తులో యాపిల్, గూగుల్ కంటే పెద్దది కావాలని అతడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు తన ఎంఓయూ సంగతి పెట్టుబడిదారులకు చెబుతానని, వాళ్లు తన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారనే ఆశిస్తున్నానని అన్నాడు.
Advertisement
Advertisement