జీఎస్‌టీపై కీలక సిఫారసులు! | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీపై కీలక సిఫారసులు!

Published Sat, Dec 5 2015 4:20 AM

జీఎస్‌టీపై కీలక సిఫారసులు! - Sakshi

- ప్రామాణిక రేటు మాత్రం 17-18 శాతం

- అత్యధిక వస్తువులకు వర్తించేది ఈ రేటే

- అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ సిఫారసులు

- దీన్ని గరిష్ట పరిమితిగా పేర్కొనటానికి మాత్రం విముఖత

- గరిష్ట పరిమితిని రాజ్యాంగంలో కూడా చేర్చాలంటున్న కాంగ్రెస్

 

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై సందిగ్ధత వీడటం లేదు. ప్రతిష్టంభన తొలగించటానికి ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యన్ సారథ్యంలోని కమిటీ శుక్రవారం కీలక సిఫార్సులు చేసినా... వాటిలో విపక్ష కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్లుగా 18 శాతం గరిష్ట పరిమితి విధించే అంశం మాత్రం లేదు. అత్యధిక వస్తువులకు వర్తించేలా 17-18 శాతం ప్రామాణిక రేటును కమిటీ సిఫారసు చేసినా... దాన్నే గరిష్ట పరిమితిగా పేర్కొని, సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై మాత్రం విముఖత వ్యక్తంచేసింది. ‘‘దేశాన్ని ఒకటిగా చేయడానికి ఇదో చరిత్రాత్మక అవకాశం. అత్యధిక వస్తువులు, సేవలు ప్రామాణిక రేటు 17-18 శాతంలోనే ఉండాలి’’ అని కమిటీ స్పష్టం చేసింది. ఇతర వస్తువులకు సంబంధించి తక్కువ రేటుండే వస్తువులపై కనిష్ట రేటు 12 శాతంగా, లగ్జరీ కార్లు, సాఫ్ట్‌డ్రింక్స్, పొగాకు వంటి ఉత్పత్తులపై గరిష్ట రేటు 40 శాతంగా సిఫారసు చేసింది.

 

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) జీఎస్‌టీ పన్ను రేట్లు కనిష్ఠంగా 15 శాతం... గరిష్ఠంగా 40 శాతం వరకూ ఉంటాయని, కాకపోతే అత్యధిక వస్తువులు 17-18 ప్రామాణిక పన్ను రేటు పరిధిలోనే ఉంటాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ స్పష్టంచేసింది. కేంద్ర-రాష్ట్రాల మధ్య రెవెన్యూ న్యూట్రల్ రేటును (ఆర్‌ఎన్‌ఆర్) 15 - 15.5 శాతంగా నిర్ణయించవచ్చని సూచిస్తూ... 15 శాతానికే మొగ్గు చూపింది. అంతర్రాష్ట్ర అమ్మకాలపై జీఎస్‌టీ రేటుకి అదనంగా ఒక శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టాలంది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదికను అందజేసింది. ప్రారంభ దశలో ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావొచ్చని సిఫార్సు చేసింది.

ఈ సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా చెప్పారు.‘జీఎస్‌టీ అమలుకు ఒక చరిత్రాత్మక అవకాశం దేశం ముంగిట ఉంది. ఇది పన్నుల విభాగాలను పటిష్టం చేస్తుంది. రాష్ట్రాల మధ్య అవరోధాలను తొలగిస్తుంది. ఉమ్మడి మార్కెట్‌ను సృష్టిస్తుంది’ అని నివేదికను సమర్పించిన అనంతరం సుబ్రమణ్యన్ వివరించారు. నీతి ఆయోగ్  కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా.. పరిస్థితిని బట్టి మార్పులు, చేర్పులపై తక్షణం నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు తప్పనిసరిగా ఉండాలి కనుకే  జీఎస్‌టీ రేట్లను రాజ్యాంగ బిల్లులో చేర్చడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.

 పొగాకు ఉత్పత్తులపై గరిష్ట రేటు ..
 సాధారణంగా జీఎస్‌టీ విధానం అమల్లోకి వస్తే వివిధ అంశాల కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు మారిపోతాయి. ఇలా పన్ను చట్టాల్లో మార్చినా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా గతంలోలాగే వచ్చే విధంగా చూసేందుకు ఉద్దేశించినది రెవెన్యూ న్యూట్రల్ రేటు (ఆర్‌ఎన్‌ఆర్). ఇటు రాష్ట్రాలకు, అటు కేంద్రానికి ఆదాయ నష్టం కలగని విధంగా ఉండే రెవెన్యూ న్యూట్రల్ రేటును లెక్కించేందుకు సీఈఏ కమిటీ 3 విధానాలను పరిశీలించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) సూచించిన విధానంతో పాటు  ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు తదితర అంశాలను అధ్యయనం చేసింది.

చాలా మటుకు ఉత్పత్తులకు ప్రామాణికంగా 17-18 శాతం రేటును ప్రతిపాదించింది. వివిధ ఉత్పత్తులు, సర్వీసులకు 12-40 శాతం దాకా శ్రేణిలో జీఎస్‌టీ రేటుకు కనిష్ట, గరిష్ట పరిమితులు ఉండొచ్చని పేర్కొంది. లగ్జరీ కార్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, ఏరేటెడ్ బెవరేజెస్ మొదలైన వాటిపై గరిష్ట రేటు విధించవచ్చని సూచించింది. విలువైన లోహాలపై 2-6 శాతం శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. కాగా, నివేదికను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. జీఎస్‌టీ వస్తే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 2 శాతం మేర తోడ్పడగలదని ఫిక్కీ నేత దీదార్ సింగ్ తెలిపారు.  
 
 జీఎస్‌టీ వివాదం..
 ఎక్సైజ్, సేవా పన్ను, అమ్మకపు పన్ను వంటి వివిధ రకాల పరోక్ష పన్నులు, పన్నుల మీద పన్నుల బాదరబందీ లేకుండా .. ఒకే పన్ను రేటును అమలు చేసేందుకు ఉద్దేశించినది జీఎస్‌టీ బిల్లు. ఇందులో కీలకమైన ఆర్‌ఎన్‌ఆర్ 18 శాతానికన్నా దిగువనే ఉండాలని, వస్తువులపై ఒక్క శాతం అదనపు పన్నును తొలగించాలని, అలాగే ప్రామాణిక రేటును రాజ్యాంగ సవరణ బిల్లులోనూ పొందుపర్చాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే, దీన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో చేరిస్తే ప్రభుత్వం మార్పులు చేయాల్సి వచ్చిన ప్రతిసారీ పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది ఆమోదించాల్సి వస్తుంది. దీనిపై ప్రభుత్వం సుముఖంగా లేదు. ఫలితంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌లోగా జీఎస్‌టీని అమల్లోకి తెచ్చేందుకు ప్రతిష్టంభన ఏర్పడింది. దీన్ని తొలగించి తగు పరిష్కారాన్ని సూచించేందుకు అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ ఏర్పాటు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement