సౌదీలో 180 మంది ప్రవాసాంధ్రుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

సౌదీలో 180 మంది ప్రవాసాంధ్రుల అరెస్ట్

Published Thu, Jan 9 2014 2:16 AM

180 telugu people arrested in Saudi Arabia

 హైదరాబాద్, న్యూస్‌లైన్: సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులకు మళ్లీ ‘నితాఖత్’ కష్టాలు మొదలయ్యాయి.  గత మూడు రోజులుగా సౌదీ అరేబియా పోలీసులు అక్రమంగా నివాసముంటున్న వందలమందిని అరెస్ట్ చేశారు. రాజధాని రియాద్‌లోని హారాలో అక్రమంగా నివాసముంటున్న తెలుగువారిని కూడా అరెస్ట్ చేశారు. వీరి సంఖ్య 180కి పైగానే ఉంది. హారాలో ఎక్కువగా హైదరాబాద్, వైఎస్సార్, చిత్తూరు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉంటున్నారు. ఆ ప్రాంతంలో రోడ్లు, కాలనీలు, నివాసాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటుచేసి వర్క్ పర్మిట్ లేని వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

అక్రమంగా ఉంటున్న వారికి వర్క్ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు గత నవంబర్ 3తో గడువు ముగిసినప్పటికీ... చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో అక్కడి ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించి వెసులుబాటు కల్పించింది. ఈ గడువు కూడా తీరడంతో వర్క్ పర్మిట్ లేని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిని కట్టడి చేసేందుకు ఆ దేశంలో నితాఖత్ అనే కొత్త కార్మిక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే చొరవ తీసుకొని అక్కడి తెలుగు వారిని ఆదుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement