24న త్రిసభ్య కమిటీ భేటీ! | Sakshi
Sakshi News home page

24న త్రిసభ్య కమిటీ భేటీ!

Published Fri, Aug 19 2016 2:48 AM

3member committe to be meet on 24th over krishna water

సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరిపై గుర్రుగా ఉన్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఈ నెల 24న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. జలాల వాడకం విషయంలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరుపై ఈ సమావేశంలోనే ఇరు రాష్ట్రాలను గట్టిగా ప్రశ్నించాలని నిశ్చయించింది. ఈ మేరకు సమావేశ వివరాలను తెలియజేస్తూ బోర్డు గురువారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. నీటి వినియోగం విషయంలో తమకు మాటమాత్రమైనా చెప్పకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్న తెలంగాణ, ఏపీలపై బోర్డు ఇది వరకే ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతంలో చేసుకున్న ఒప్పందాలను విస్మరించి నీటిని వాడుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, తె లంగాణ.. జూరాల నుంచి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడులకు తమకు తెలపకుండానే, నీటి అవసరాల ఇండెంట్ ఇవ్వకుండానే నీటిని వాడుకోవడాన్ని తప్పుపట్టింది. ప్రాజెక్టుల వారీగా నీటి పరిస్థితులు, ఇరు రాష్ట్రాల అవసరాలు, మైనర్ ఇరిగేషన్ కింద వినియోగిస్తున్న నీటిపై ఏ రాష్ట్రం వివరాలు ఇవ్వలేదని, ఇప్పటికైనా వివరాలు సమర్పించాలని లేఖలో కోరింది.

Advertisement
Advertisement