నెత్తు‘రోడ్డు’తున్నాయ్...! | Sakshi
Sakshi News home page

నెత్తు‘రోడ్డు’తున్నాయ్...!

Published Tue, Jul 21 2015 1:47 AM

నెత్తు‘రోడ్డు’తున్నాయ్...! - Sakshi

రాష్ట్రంలో రోజూ 55 ప్రమాదాలు..47 మరణాలు
గతేడాది 20,078 ప్రమాదాల్లో 16,696 మంది బలి
మృతుల్లో యువత, పురుషులే అధికం
వ్యక్తిగత వాహనాల వాడకంతోనే ఎక్కువ ప్రమాదాలు
దేశవ్యాప్త ప్రమాదాల్లో పదో స్థానంలో తెలంగాణ
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల్లో వెల్లడి

 
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలితీసుకుంటున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)-2014 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సరాసరిన రోజుకు 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా వాటిలో 47 మంది మృత్యువాతపడుతున్నారు. ప్రమాదాల నమోదులో రాష్ట్రం దేశంలో పదో స్థానంలో నిలిచిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది. మొదటి ఐదు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది మొత్తం 20,078 ప్రమాదాలలో 16,696 మంది మృత్యువాతపడ్డారు. విద్య, ఉద్యోగం ఇతర అవసరాల నేపథ్యంలో నిత్యం రహదారులపై సంచరించే వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ప్రమాద మృతుల్లో యుక్త, మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 16,696 మంది మరణించగా వీరిలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్కులు 10,048 మంది ఉన్నట్లు తేలింది. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించే వారి కంటే వ్యక్తిగత వాహనాలు వాడే వారే ఎక్కువగా చనిపోతున్నారు. స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్న నేపథ్యంలో మృతుల్లో పురుషుల సంఖ్య 8,240గా, స్త్రీలు 1,808గా ఉంది. కుటుంబ పోషణ భారాన్ని మోసేది ఎక్కువగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో ఈ ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు యజమానుల్ని కోల్పోయి ఆర్థికంగానూ చితికిపోతున్నాయి. డ్రైవింగ్ రాకపోయినా, లెసైన్సు లేకపోయినా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా రహదారులపైకి వాహనాలతో దూసుకువస్తున్న మైనర్లూ ప్రమాదాలబారిన పడి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన 18 ఏళ్లలోపు వయస్కులు 1,266 మంది ఉండటం దీనికి నిదర్శనం.

డిసెంబర్‌లోనే అత్యధికం: శీతాకాలం కావడంతో పొగమంచు వల్ల రాష్ట్రంలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం డిసెంబర్‌లోనే చోటు చేసుకున్నాయి. దాదాపు పదో వంతుకుపైగా... అంటే 2,171 యాక్సిడెంట్స్ ఈ నెల్లోనే జరిగాయి. ఏడాది మొత్తమ్మీద అతి తక్కువగా సెప్టెంబర్‌లో 1,455 ప్రమాదాలు నమోదయ్యాయి. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యనే సంభవించినట్లు ఎన్‌సీఆర్‌బీ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో అత్యధికంగా 3,484 ప్రమాదాలు జరిగాయి. ‘యాక్సిడెంట్ ప్రోన్ టైమ్’గా భావించే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య అతితక్కువగా 1,585 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అగ్నిప్రమాదాలూ వందల మందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. గతేడాది 638 అగ్నిప్రమాదాలు జరగ్గా వాటిలో 624 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. వంటింట్లో జరుగుతున్న ప్రమాదాలే దీనికి కారణమనే భావన ఉంది. మొత్తం మృతుల్లో 285 మంది పురుషులుకాగా 339 మంది స్త్రీలు ఉన్నారు.
 

Advertisement
Advertisement