ప్రధాని మోదీకి భారీ మద్దతు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి భారీ మద్దతు

Published Tue, Nov 15 2016 3:53 PM

ప్రధాని మోదీకి భారీ మద్దతు - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తుండగా, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తప్పుపట్టారు. ఇది అనాలోచిత చర‍్యని, దీనివల్ల ఆర్థిక రంగం కుదేలవుతుందన్న విమర్శలు వచ్చాయి. కరెన్సీ కొరత వల్ల సామాన్యులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మోదీ నిర్ణయానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని 82 శాతం మంది సమర్థిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టేందుకు మోదీ తీసుకున్న చర్యను వారు సమర్థించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రెండు రోజులు దేశంలోని 10 ప్రధాన నగరాల్లో ఇప్సాస్‌ సర్వే చేసింది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, లక్నో నగరాల్లో సర్వే చేశారు. యాప్‌ యూజర్లతో సహా దాదాపు 5 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 35 ఏళ్ల లోపు వారు మోదీ నిర్ణయాన్ని 80 శాతం మంది సమర్థించారు. నల్లధనాన్ని అరికట్టే విషయంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని 84 శాతం మంది చెప్పారు. కాగా ఏటీఎంలలో రోజుకు 2 వేల రూపాయల మాత్రమే విత్‌ డ్రా (ప్రస్తుతం 2,500) పరిమితి పెట్టడంపై 52 శాతం మంది విభేదించారు.

Advertisement
Advertisement