దేశంలో రోజుకు 92 అత్యాచారాలు! | Sakshi
Sakshi News home page

దేశంలో రోజుకు 92 అత్యాచారాలు!

Published Thu, Sep 4 2014 5:37 PM

దేశంలో రోజుకు 92 అత్యాచారాలు! - Sakshi

భారతదేశంలో ప్రతిరోజూ సగటున 92 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారట. దేశ రాజధానిలో అయితే రోజుకు నాలుగు చొప్పున ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో అత్యధికంగా ఇక్కడే 1636 కేసులు నమోదయ్యాయి. జాతీయ నేర రికార్డుల సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 2012లో మన దేశంలో మొత్తం 24,923 అత్యాచార కేసులు నమోదైతే.. 2013లో వాటి సంఖ్య 33,707కు పెరిగింది. ఈ 33వేల మందిలో సగానికి పైగా.. అంటే  15,556 కేసుల్లో బాధితులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసువారేనట.

ఢిల్లీలో గడిచిన సంవత్సరంతో పోలిస్తే అత్యాచారాలు రెట్టింపు అయ్యాయి. 2012లో కేవలం 706 కేసులే నమోదు కాగా, 2013లో ఏకంగా 1636 నమోదయ్యాయి. ఢిల్లీ తర్వాత ముంబైలో 391, జైపూర్లో 192, పుణెలో 171 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. సగటున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే రోజుకు 11 అత్యాచారాలు జరుగుతున్నాయి. 2013లో అక్కడ 4,335 కేసులు నమోదయ్యాయి. ఇది అన్ని రాష్ట్రాల్లోకీ అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 3285 కేసులతో రాజస్థాన్, 3063 కేసులతో మహారాష్ట్ర, 3050 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

మైనర్లపై అత్యాచారాలు 2012 సంవత్సరంలో 9082 నమోదు కాగా, 2013లో 13,304 నమోదయ్యాయి. ప్రధానంగా నగరాల్లోనే ఈ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. 94 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు బాగా తెలిసినవారే అవుతున్నారు. 539 కేసుల్లో సొంత తల్లిదండ్రులు, 10782 కేసుల్లో పొరుగువాళ్లు, 2,135 కేసుల్లో బంధువులు, 18,171 కేసుల్లో తెలిసినవారు నిందితులుగా ఉన్నారు.

Advertisement
Advertisement