సీఎంకు వ్యతిరేకంగా వేరే రాష్ట్ర మంత్రి వీరంగం! | Sakshi
Sakshi News home page

సీఎంకు వ్యతిరేకంగా వేరే రాష్ట్ర మంత్రి వీరంగం!

Published Tue, Oct 4 2016 8:12 PM

సీఎంకు వ్యతిరేకంగా వేరే రాష్ట్ర మంత్రి వీరంగం! - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆప్‌ మంత్రి వీరంగం సృష్టించారు. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తితో వేదిక పంచుకోవడానికి ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి కపిల్‌ మిశ్రా నిరాకరించారు. బుర్హాన్‌ వనీ, ఆఫ్జల్‌ గురు మీరు ఎలా భావిస్తారు? అంటూ ఆయన ముఫ్తిని ప్రశ్నించారు. దీంతో సీఎం ముఫ్తి వెంట ఉన్న అధికార యంత్రాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పర్యాటక రంగంపై నిర్వహించిన సదస్సు గందరగోళంగా మారింది.

సదస్సులో మిశ్రా మాట్లాడుతూ హిజ్జుబుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ పొరపాటు అని, అలా జరిగి ఉండాల్సింది కాదని ముఫ్తి పేర్కొన్నారని విమర్శించారు. పార్లమెంటుపై దాడి నిందితుడు ఆఫ్జల్‌ గురు, బుర్హాన్‌ వనీ ఉగ్రవాదులు ఔనా? కాదా? అన్నది ఆమె తెలుపాలని మిశ్రా డిమాండ్‌ చేశారు. ముఫ్తితో తాను వేదిక పంచుకోలేనంటూ ఆయన మధ్యలోనే సదస్సు నుంచి వెళ్లిపోయారు. ముఫ్తిని విమర్శిస్తూ ఆయన ప్రసంగిస్తుండగా కొందరు ప్రేక్షకులు, ముఫ్తి వెంట ఉన్న అధికారులు గట్టిగా నిరసన తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. టూరిజం, టెర్రరిజం కలిసి సాగలేవంటూ ఆప్‌ మంత్రి పేర్కొనగా.. ఆయన వ్యాఖ్యలతో సీఎం ముఫ్తి విస్తుపోయారు. మహిళలపై అత్యాచారాల విషయంలో ఢిల్లీ కన్నా జమ్ముకశ్మీర్‌ మెరుగ్గా ఉందని ఆప్‌ మంత్రి ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు.

Advertisement
Advertisement